సీపీఎస్ పై నివేదికను పరిశీలించి న్యాయం చేస్తా

 

• ఉద్యోగుల సమస్యలను ప్రాధాన్య క్రమంలో పరిష్కరిస్తా

• కరోనా వల్ల వాటిల్లిన ఆర్థిక నష్టంతో ఆలస్యమయింది

• తనను కలిసిన ఏపీఎన్జీవో సంఘం నేతలతో ముఖ్యమంత్రి జగన్

• పెండింగ్ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన బండి శ్రీనివాసరావు, కె.వి.శివారెడ్డి 

• 55శాతం ఫిట్ మెంట్ తో పీఆర్సీ అమలు చేయాలని విజ్ఞప్తి

• కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా డీఏలు విడుదల చేయాలని వినతి

• సీపీఎస్ రద్దు చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరిన నేతలు

• సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి 

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)

సెప్టెంబరు 15 :   ఉద్యోగులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్ ను ఆయన క్యాంపు కార్యాలయంలో ఏపీఎన్జీవోల సంఘం రాష్ర్ట అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి కె.వి.శివారెడ్డి ఆధ్వర్యంలో సంఘం రాష్ర్ట కార్యవర్గం బుధవారం కలిసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావలిసిన రాయితీలు, వారు ఎదుర్కుంటున్న అనేక సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వచ్చి వాటికి సంబంధించిన వినతి పత్రాలను నేతలు అందించారు.

• 11వ పీఆర్సీ  నివేదికను కమిషనర్ ప్రభుత్వానికి 5/10/2020నే సమర్పించిన సంగతిని ముఖ్యమంత్రికి గుర్తు చేసి కాలాతీతం లేకుండా ఉద్యోగ సంఘ నాయకులతో వెంటనే చర్చించి జూలై 1, 2018 నుంచి  55% ఫిట్ మెంట్ తో పీఆర్సీని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

• 01-07-2018 నుంచి చెల్లించవలసిన కరవు భత్యం (డీఏ) బకాయలను చెల్లించేందుకు ఉత్తర్యులు ఇచ్చినప్పటికీఇంతవరకు అమలు కాలేదని, కావున డీఏ లను వెంటనే విడుదల చేయాలని కోరారు.  కోవిడ్ కారణంగా కేంద్ర ప్రభుత్వం స్తంభింప చేసిన 3 డీఏలను విడుదల చేసిందని, తదనుగుణంగా కొన్ని రాష్ట్రాలు వారి ఉద్యోగులకు సదరు డీఏ లను విడుదల చేశాయని, మన రాష్ట్రంలో కూడా ఆ 3 డీఏ లను వెంటనే విడుదల చేయాలని కోరారు. సదరు డీఏల లెక్కింపులో కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాలను అనుసరించేలా ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. 

• సీపీఎస్ పై రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి టక్కర్ గారి నివేదికపై ఏర్పాటు అయిన మంత్రుల బృందం ఇచ్చిన నివేదిక పై తక్షణమే నిర్ణయం తీసుకొని సీపీఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలులోనికి తీసుకొని రావాలని కోరారు. మంత్రుల బృందం ఇచ్చిన నివేదికను పరిశీలించి ఉద్యోగుల నాయకులతో చర్చించి త్వరలో ఉద్యోగులకు తగు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

• కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో ఏర్పాటు చేసిన మంత్రుల బృందం ఇచ్చిన నివేదికను పరిశీలించి కాంట్రాక్టు ఉద్యోగులందరిని వెంటనే క్రమబద్దీకరించాలని కోరారు. కరోనా వలన ప్రాణాలు కోల్పోయిన కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలలో అర్హులైన వారికి ఉద్యోగాలు కల్పించాలని, ఆ కుటుంబాలకు ఆర్ధిక సహాయం చేసి ప్రభుత్వం వారిని ఆదుకోవాలని ఎన్జీవో సంఘం నేతలు కోరారు. 

• 4వ తరగతి ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సును మిగిలిన ఉద్యోగులకు పెంచిన విధంగా 2 సంవత్సరాలు పొడించాలని, ఉద్యోగ విరమణ వయస్సును 60 సంవత్సరాలు నుంచి 62 సంవత్సరాలు వరకు పెంచాలని కోరారు.

• గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘ నాయకులు, తాలూకా, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఒక చోట 9 సంవత్సరాలు పనిచేయవచ్చన్న నిబంధనను పునరిద్దరించాలని గతంలో కోరగా ముఖ్యమంత్రి అప్పట్లోనే అంగీకరించినప్పటికీ, ఇంతవరకు ఉత్తర్వులు రాలేదని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు ముఖ్యమంత్రి స్పందిస్తూ త్వరలో ఉత్తర్వులు ఇస్తామని హామీ ఇచ్చారు.

• రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులు అందరికి వారు పనిచేసే ప్రాంతాలలో ఇంటి స్థలాలను మంజూరు చేయాలని ఎన్జీవో సంఘం నేతలు కోరారు.

• కోవిడ్ సోకిన అన్ని శాఖల ఉద్యోగులకు 30 రోజులు ప్రత్యేక  క్యాజువల్ లీవ్ ను మంజూరు చేయాలని, అలాగే కోవిడ్ విధులు నిర్వహిస్తూ మరణించిన అన్ని శాఖల ఉద్యోగుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం తో పాటు కుటుంబంలో అర్హులు అయినవారికి వెంటనే కారుణ్య నియామకాల కింద ఉద్యోగం ఇవ్వాలని కోరారు. పెన్షన్ వగైరా ఆర్ధిక వసతులను వెంటనే చెల్లించాలని కోరారు.

• కమర్షియల్ టాక్స్ శాఖలో పనిచేసే అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ / గూడ్స్ & సర్వీస్ టాక్స్ ఆఫీసర్ కు గెజిటెడ్ హోదా కల్పించాలని కోరారు. దీనిపై త్వరలో ఉత్తర్వులు ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

• ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు రావలసిన పెన్షనరీ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని, ఉద్యోగస్తులు కోరిన వెంటనే జి.పి.ఎఫ్. అడ్వాన్సు, ఎ.పి.జి.ఎల్.ఐ లోను తదితర బిల్లులను సత్వరమే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎన్జీవో సంఘం నేతలు కోరారు.  

• రాష్ట్రంలో వివిధ శాఖలలో బారీగా ఉన్న ఉద్యోగాల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. 

• గ్రామ / వార్డ్ సచివాలయ ఉద్యోగులను, ఎటువంటి శాఖాపరమైన పరీక్షలతో సంబంధం లేకుండా గతంలో ఉత్తర్యులు ఇచ్చిన విధంగా అక్టోబర్ 2వ తేదీన ప్రొబేషన్ డిక్లేర్ చేసి వేతన స్కేళ్ళను అమలు పరచాలని కోరారు. 

• ప్రభుత్వ పరీక్షల రాష్ట్ర కార్యాలయం (SSC Board) అధికారులను, ఉద్యోగులను ముఖ్యంగా మహిళా ఉద్యోగినులను ఇన్ ఛార్జ్ డైరెక్టర్ సుబ్బా రెడ్డి వేధింపులకు గురిచేస్తున్నారని, ఆయనను తక్షణమే బదిలీ చేసి మహిళా ఉద్యోగిను లకు రక్షణ కల్పించాలని కోరారు. అకారణంగా సస్పెండ్ చేసిన అధికారులు, ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకొనేలా ఉత్తర్వ్యలు ఇవ్వాలని కోరారు. కార్యాలయంలో సరిపడిన రెగ్యులర్ ఉద్యోగులు లేనప్పటికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను డిప్యుటేషన్ పై SSA కు పంపిన ఉత్తర్యులను రద్దు చేయాలని, వారిని SSC బోర్డులోనే విధులు నిర్వర్తించేలా ఉత్తర్యులు ఇవ్వాలని కోరారు.

 

ఎన్జీవో సంఘం నేతల డిమాండ్లను సావధానంగా విన్న ముఖ్యమంత్రి జగన్ స్పందిస్తూ  ఉద్యోగులు తమ ప్రభుత్వంలో భాగస్వాములని, వారి సంక్షేమం చూడవలసిన బాధ్యత తమదేనని చెప్పారు. కరోనా వలన జరిగిన ఆర్ధిక నష్టం వలన కొంత ఆలస్యం అయిందని, ఈ పరిస్థితులను అర్ధం చేసుకొని సహకరించిన ఉద్యోగులు అందరికి అభినందనలు  తెలియచేస్తున్నానని చెప్పారు. త్వరలోనే ఉన్నతాధికారులందరితో చర్చించి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఉద్యోగుల సమస్యలు అన్నింటిని ప్రాధాన్య క్రమంలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి జగన్ సానుకూలంగా స్పందించినందుకు ఏపీఎన్జీవో సంఘం నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. 

ముఖ్యమంత్రిని కలిసిన బృందంలో ఏపీఎన్జీవో సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎన్.చంద్ర శేఖర్ రెడ్డి, రాష్ట్ర సహ అధ్యక్షుడు సి.హెచ్.పురుషోత్తం నాయుడు, రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.దస్తగిరి రెడ్డి, ఎం.. పరమేశ్వర రావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బి.కృపావరం, రాష్ట్ర కోశాధికారి ఎం.వెంకటేశ్వర రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు వి.సుబ్బా రెడ్డి, ఎ.రంగా రావు, గుంటూరు జిల్లా అధ్యక్షుడు టి.వి. రామి రెడ్డి, గ్రామ వార్డ్ సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జానీ పాషా, ఎన్జీవోసఘం  రాష్ట్ర కార్యవర్గ నాయకులు పాల్గొన్నారు.