1816 మంది వీఆర్వోలకు అన్యాయం
 

•     మాకు పదోన్నతులు లేక నష్టపోతున్నాం
•    న్యాయం చేయాలని ఏపి డైరెక్ట్ రిక్రూట్మెంట్ విఆర్వో స్ అసోసియేషన్ విజ్ఞప్తి

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
సెప్టెంబరు 16: ప్రత్యక్ష నియామక పద్ధతిలో రాతపరీక్షలో ఎంపికయిన వీఆర్వోలు పదోన్నతులు లేక అన్యాయానికి గురవుతున్నారని, ముఖ్యమంత్రి జగన్ జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని ఏపి డైరెక్ట్ రిక్రూట్మెంట్ విఆర్వో స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు  పి.ప్రసన్న కుమార్ విజ్ఞప్తి చేశారు.  తమ సమస్యలను పరిష్కరిస్తామని జగన్ మేనిఫెస్టో లో హామీ ఇచ్చిన సంగతిని గుర్తు చేశారు. రెవెన్యూ శాఖ లో ఒక్క పదోన్నతీ లేకుండా ఉద్యోగ విరమణ చేసేది  2012,2014 బ్యాచ్లో ఏపీపీఎస్సీ రాత పరీక్ష ద్వారా ప్రతిభ తో ఎంపికైన 1816 మంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ విఆర్వో లు మాత్రమేనని వాపోయారు. 
తమ సమస్య గురించి ముఖ్యమంత్రితో పాటు  మంత్రులు, ప్రభుత్వ సలహాదారు లను, ఉన్నతాధికారులను ఎన్నో సార్లు కలిసి  విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయిందని విచారం వ్యక్తం చేశారు.  డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్వో ల గురించి ముఖ్యమంత్రిని మరోసారి కలిసి విజ్ఞప్తి చేద్దామనుకున్నా తమకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా కొంత మంది కుట్రలు చేశారని ఆరోపించారు. సీఎం మెయిల్ కు ఎన్నో విజ్ఞప్తులు చేశామని తెలిపారు. 
2012,2014 డైరెక్ట్ రిక్రూట్మెంట్ విఆర్వో లకు ఒన్ టైం సెటిల్ మెంట్ కింద సీనియర్ అసిస్టెంట్ / మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ లుగా పదోన్నతులు కల్పించాలని లేదా వీఆర్వోలు/ జూనియర్ అసిస్టెంట్ ల క్యాడర్ స్ట్రెంత్ రేషియో ప్రకారం వీఆర్వో లకు86%- జూనియర్ అసిస్టెంట్ లకు 14% చొప్పున పదోన్నతి కల్పించాలన, వీఆర్వలలో  డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్వోలకు ప్రత్యేక   రేషియో 70% తో పదోన్నతులు కల్పించాలని కోరారు.  లేదంటే 1816 మంది కి 15004 గ్రామ వార్డ్  సచివాలయాలలో ప్రతి 5 సచివాలయాలను ఒక క్లష్టర్ గా చేసి సీనియర్ అసిస్టెంట్ హోదాలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్గా ఒన్ టైం సెటిల్ మెంట్ కింద  పదోన్నతులు కల్పించాలని కోరారు. 
లేదంటే  ఇప్పటికే 10 సంవత్సరాలు నష్టపోయిన డైరెక్ట్ రిక్రూట్మెంట్ 2012,2014 బ్యాచ్  విఆర్వో లు-1816 మంది కి  రెవెన్యూ శాఖ లో లేకపోతే వేరే శాఖ ల లో సీనియర్ అసిస్టెంట్ క్యాడర్ లో పదోన్నతులు కల్పించాలని కోరారు. తమ సమస్యలు విన్నవించడానికి అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరారు.