ధనిక తెలంగాణలో ఇదేం గోస?
 

    జీతాల కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదురు చూపులు
•    ఇంటద్దె సకాలంలో చెల్లించలేకపోతున్నారు
•    కిరాణా, పాలకూ చెల్లింపులు ఆలస్యమే
•    అవమానాలు భరించాల్సి వస్తోంది
•    టీఎస్ యూటీఎఫ్ ఆవేదన

  పెండింగ్ బిల్లుల విడుదల కోరుతూ ట్రెజరీల ఎదుట ఉపాధ్యాయుల ధర్నాలు
(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
సెప్టెంబరు 16: ఉద్యోగుల జీతాలు, విశ్రాంత ఉద్యోగుల పెన్షన్లు నెల మొదటి తేదీనే విడుదల చేయాలని, సప్లిమెంటరీ బిల్లులను సిటిజన్ చార్టర్ లో నిర్దేశించిన ప్రకారం నిర్దిష్ట గడువులోగా చెల్లించాలని, నిధుల విడుదలలో టోకెన్ నంబరు, తేదీల వరుస క్రమాన్ని పాటించాలని డిమాండ్ చేస్తూ గురువారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎస్టీఓ, డీటిఓ కార్యాలయాల ఎదుట టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించారు. అనంతరం ఎస్టీఓ, డీటీఓ, పీఏఓల ద్వారా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కి వినతిపత్రం అందజేశారు.  ఈ సందర్భంగా టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కె జంగయ్య నాగర్ కర్నూలు డీటీఓ ఎదుట, ప్రధాన కార్యదర్శి చావ రవి, ఉపాధ్యక్షులు దుర్గాభవాని ఖమ్మం డీటీఓ ఎదుట, మరో ఉపాధ్యక్షుడు సీహెచ్ రాములు సూర్యాపేట, కోశాధికారి లక్ష్మారెడ్డి సంగారెడ్డి డీటీఓ ఎదుట జరిగిన ధర్నాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... గత రెండు సంవత్సరాలుగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతనాలు, విశ్రాంత ఉద్యోగుల పెన్షన్లు ఎప్పుడొస్తాయో తెలియని అయోమయం నెలకొన్నదని, జీతాలు రాక  ఈఎంఐ లు సకాలంలో కట్టక ఉద్యోగులు పెనాల్టీలు కట్టుకుంటున్నారని చెప్పారు. పిల్లల ఫీజులు, ఇంటద్దె, పాలు, కిరాణా తదితర చెల్లిపులకు జీతం రాలేదని చెబితే నమ్మలేనట్లు చూసే అనుమానపు చూపులతో అవమాన పడుతున్నారన్నారు.  ప్రతి నెల 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు రోజుకు కొన్ని జిల్లాల చొప్పున రొటేషన్ పద్దతిలో విడుదలవుతున్న జీతాల్లో తమ వంతుకోసం చకోర పక్షుల్లా ఎదురు చూడాల్సి వస్తోందన్నారు. మిగులు బడ్జెట్ ఉన్న ధనిక రాష్ట్రంలో వేతన జీవుల వెతలకు అంతులేదన్నారు.
 కోవిడ్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గిందని, ఆర్థిక ఇబ్బందుల కారణంగానే జీతాలు ఆలస్యం అవుతున్నాయనటం సహేతుకం కాదన్నారు. వివిధసంక్షేమ పథకాలకు రూ.వేలకోట్లు కేటాయిస్తున్న ప్రభుత్వం ఆ సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు జరిపే యంత్రాంగంలో భాగమైన ఉద్యోగుల జీతాలను సక్రమంగా చెల్లించకపోవటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.


సప్లిమెంటరీ వేతనాలు, పీఆర్సీ, డీఏ బకాయిలు, సెలవు వేతనం, రిటైర్మెంట్ బెనెఫిట్స్, జీపీఎఫ్, మెడికల్ రీయింబర్స్మెంట్ తదితర బిల్లులు సంబంధిత ట్రెజరీల్లో పాస్ అయిన తరువాత ఉద్యోగుల ఖాతాల్లో నగదు జమకావటానికి "ఉత్తరం, దక్షిణ" లతో పైరవీ చేసుకోవాల్సి వస్తోందని లేదా నెలల తరబడి ఎదురు చూడాల్సివస్తున్నదని ఆరోపించారు. 2020 నవంబర్ నుంచి బిల్లులు పెండింగులో ఉన్నాయన్నారు. 
నెల మొదటి తేదీన వేతనాలు పొందడం ఉద్యోగులు పోరాడి సాధించుకున్న హక్కని,  దానిని గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని అన్నారు. సిటిజన్ చార్టర్ ప్రకారం సప్లిమెంటరీ బిల్లులకు నిర్దిష్ట గడువు పెట్టి, వరుసక్రమంలో నిధులు విడుదల చేయాలని  ఆర్థిక శాఖ  అధికారులను టీఎస్ యూటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. 
రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ధర్నాల్లో సంఘం  రాష్ట్ర ఆఫీసు బేరర్లు, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో పాటు స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.