పీఆర్సీ నివేదిక సమర్పించి ఏడాది!

- మరో 15 రోజుల్లో వార్షికోత్సవం
-  ఇప్పటికీ ఆ నివేదిక బయటకు రాలేదు
- అమలుకు మీనమేషాలు
(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
సెప్టెంబరు 20- ఆంధ్రప్రదేశ్ లో  ఉద్యోగుల వేతన సవరణ సంఘం తన నివేదిక సమర్పించి మరి కొద్ది రోజుల్లో ఏడాది కాబోతోంది.  అక్టోబరు 5న పీఆర్సీ నివేదికను ప్రభుత్వానికి కమిషన్ లోని అధికారులు సమర్పించారు.  అంటే మరో 15 రోజుల్లో ఈ నివేదిక సమర్పించి ఏడాది కాబోతోంది. నివేదిక అందిన తర్వాత  ఇంతకాలం ఎప్పుడూ దాన్ని పెండింగులో ఉంచిన దాఖలాలు లేవని ఉద్యోగ సంఘ నాయకులే చెబుతున్నారు. ఈ  నివేదికను ప్రభుత్వం ఇంకా బయటపెట్టలేదు. పీఆర్సీ అంటే కేవలం జీతాలు, భత్యాల పెంపు కాదు.  ఇతరత్రా అనేక సమస్యలకు సంబంధించి ఉద్యోగ సంఘాలన్నీ తమ ప్రతిపాదనలు సమర్పించాయి. అందులో వేటికి ఏ స్థానం కల్పించారో కూడా ముఖ్యమే. ముందు పీఆర్సీ నివేదిక బయట పెట్టండి. దానిపై చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకోవచ్చు.’’ అని ఉద్యోగ సంఘాల నాయకులు కొందరు ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. 
ఫిట్ మెంట్ 27శాతానికి సిఫార్సు
ఉద్యోగులు.న్యూస్ కు ఉన్న విశ్వసనీయ సమాచారం మేరకు వేతన సవరణ సంఘం ఫిట్ మెంట్ 27శాతం సిఫార్సు చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ప్రభుత్వం మధ్యంతర భృతి ఆ మేరకు ఇస్తోంది. ఉద్యోగ సంఘాలు ఇంతకు రెట్టింపు డిమాండ్ చేస్తూ ఉన్న ఒకసారి చర్చల ప్రక్రియ ప్రారంభమయితే దీనిపై ఒక స్పష్టత వస్తుంది.
పీఆర్సీ నివేదిక ను అధ్యయనం చేసి మంత్రి మండలికి తగిన సిఫార్సులు చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  ఆదిత్యనాథ్ దాస్ పీఆర్సీ, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సీపీఎస్ రద్దు తదితర అంశాలపై రెండు, మూడు సార్లు అధికారులతో సమావేశమయ్యారు. ఒక సమావేశానికి ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే అధికారి ప్రవీణ్ ప్రకాష్ లు కూడా హాజరయ్యారు. దీనిపై మార్గసూచి తయారు చేసే క్రమంలో ప్రయత్నాలు ప్రారంభించినా ఇంకా గట్టి ముందడుగు పడాల్సి ఉంది