ఏడు కంపెనీలుగా ఒ.ఎఫ్.బి.

  • అక్టోబరు 1న జాతికి అంకితం

• రక్షణ రంగంలో నూతన శకం

• కొత్త సంస్థల్లోకి 70వేల మంది ఉద్యోగుల బదిలీ

• రెండేళ్ల పాటు కేంద్ర ఉద్యోగుల సర్వీసు నిబంధనలే వర్తిస్తాయని కేంద్రం హామీ  

   (ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్) 

సెప్టెంబరు 23: కేంద్రప్రభుత్వంలోని ప్రతిష్ఠాత్మక ఆర్డనెన్స్ ఫ్యాక్టరీల కార్పొరేటీకరణకు రంగం సిద్ధమవుతోంది. ఈ బోర్డు కింద ఉన్న 41 కర్మాగారాలను మొత్తం 7 ప్రభుత్వ రంగ సంస్థలుగా మార్చబోతున్నారు. ఇప్పటికే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీల (ఆర్వోసీ) వద్ద నమోదయినట్లు తెలుస్తోంది. అక్టోబరు 1వ తేదీన ఈ పీఎస్యూలు జాతికి అంకితం  చేయనున్నట్లు సమాచారం. ఈ దిశగా ఆయా ఫ్యాక్టరీలలో ట్రాన్సిషన్ (బదలాయింపు) పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రక్షణ రంగంలో సరికొత్త సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ రంగంలో దేశం మరింత స్వయం సమృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.  దిగుమతులపై ఎక్కువగా ఆధార పడకుండా ఆధునిక యుద్ధ సామగ్రిని దేశీయంగానే అభివృద్ధి చేసి ఉత్పత్తి చేసుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ప్రస్తుతం మనం అధునాతన ఆయుధాలు, రక్షణ వ్యవస్థల కోసం అమెరికా, రష్యా, ఫ్రాన్స్ వంటి దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. మరోపక్క నిత్యం పొరుగున ఏదో ఒక గిల్లికజ్జాలతో కవ్విస్తున్న చైనా వద్ద అధునాతన రక్షణ వ్యవస్థలున్నాయి. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడమే మంచిదని మోదీ ప్రభుత్వం భావిస్తోంది.  ప్రస్తుతం ఆయుధాల తయారీ బాధ్యతలు చూస్తున్న ఆర్డనెన్స్ ఫ్యాక్టరీలను ప్రక్షాళిస్తే  స్వయం సమృద్ధికి బాటలు వేసుకన్నట్లే అని ప్రభుత్వం భావిస్తోంది.  ప్రస్తుతం ఆర్డనెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ (ఒఎఫ్బీ) పర్యక్షవేణలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో దేశ రక్షణ రంగానికి 41 కర్మాగారాలు సేవలందిస్తున్నాయి. అక్టోబరు 1 నుంచి ఇవి  ఏడు ప్రభుత్వ రంగ సంస్థలుగా మారబోతున్నాయి. వీటిల్లో కేంద్రం 100శాతం పెట్టుబడులు పెడుతుంది. అయితే ఈ కర్మాగారాల రోజువారీ కార్యక్రమాలలో కేంద్రప్రభుత్వ పాత్ర నేరుగా ఉండబోదు. ఈ ఫ్యాక్టరీలు ఇప్పటికే ఉన్న పీఎస్ యూలు హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లాగా స్వతంత్ర సంస్థలుగా చలామణి అవుతాయి. వాటికి యాజమాన్యబోర్డులుంటాయి. వాటి నిర్ణయానుసారమే కర్మాగారాలు పని చేస్తాయి.    కార్పొరేటీకరణ నిర్ణయంపై ఓఎఫ్బీ పరిధిలో పని చేస్తున్న దాదాపు 70వేల మంది ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. వారి ఆందోళనలో ఒక ముఖ్యాంశం తమ ఉద్యోగ భద్రత, జీతభత్యాల ప్రయోజనాలు. ఒక దశలో ఉద్యోగ, కార్మిక సంఘాలు సమ్మె చేస్తామని కూడా హెచ్చరించాయి.  అయితే అప్పట్లో సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతలు కొనసాగిన నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాయి.  ఈ నేపథ్యంలో వారి ప్రయోజనాలను పరిరక్షిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.  ఓఎఫ్బీ కార్పొరేటీకరణ అనంతరం ఉద్యోగుల ప్రయోజనాలకు సంబంధించి ఇటీవల ఒక ప్రకటన విడుదల చేసింది. ఓఎఫ్బీలోని ప్రొడక్షన్ యూనిట్లు, నాన్  ప్రొడక్షన్ యూనిట్లలోని ఏ, బీ, సీ కేటగిరీ ఉద్యోగులందరినీ త్వరలో ఏర్పడబోయే రక్షణరంగ ప్రభుత్వ రంగసంస్థలకు (డీపీఎస్ యూ)లకు బదిలీ చేస్తామని తెలిపింది.  తొలి రెండేళ్ల పాటు ఎటువంటి డిప్యుటేషన్ భత్యం లేకుండా (డీమ్డ్ డిప్యుటేషన్) వారు అక్కడ కొనసాగుతారని వెల్లడించింది. ఈ రెండేళ్లపాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే సర్వీసు నిబంధనలే వారికి వర్తిస్తాయని హామీ ఇచ్చింది. కోల్కతా లోని ఓఎఫ్బీ బోర్డు ప్రధాన కార్యాలయం, దిల్లీ కార్యాలయం, ఓఫ్ పాఠశాలలు, ఓఎఫ్ ఆస్పత్రులలోని ఉద్యోగులు త్వరలో ఏర్పాటు కాబోయే ఆర్డినన్స్ ఫ్యాక్టరీల డైరెక్టరేట్ కు బదిలీ చేస్తారు.  వీరు కూడా డీమ్డ్ డిప్యుటేషన్ పైనే బదిలీ అవుతారు. వీరికీ రెండేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు నిబంధనలే వర్తిస్తాయి. వారి పేస్కేళ్లు, భత్యాలు, సెలవులు, కెరియర్ పురోగతి వగైరా మునపటి సర్వీసు నిబంధనలకు లోబడే ఉంటాయి.  పదవీ విరమణ చేసిన వారి పింఛన్లు, ప్రస్తుత ఉద్యోగుల పింఛను మొత్తాలను ప్రభుత్వమే భరిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ అంశాలన్నింటినీ రక్షణ మంత్రి అజయ్ భట్ రాజ్యసభలో దిగ్విజయ్ సింగ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా లిఖితపూర్వకంగా తెలియజేశారు.  కొత్త డీపీఎస్ యూలు ఏర్పడిన రెండేళ్ల వరకు ఉద్యోగ భద్రతపై హామీ లభించినా ఆ తర్వాత పరిస్థితి ఏమిటన్నదానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు.  ఈ అంశంపై ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.  కార్పొరేటీకరణపై ఇంకా సమాధానాలు లేని ప్రశ్నలెన్నో ఉన్నాయి.  ఓఎఫ్బీ అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోతోందని, దేశ రక్షణ అవసరాలకు తగ్గ సామర్థ్యాన్ని కనబర్చలేకపోతోందని ప్రభుత్వం భావిస్తోంది. ఎక్స్పర్ట్ కమిటీల నివేదికలూ ఇదే అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించాయి.  అయితే ఇప్పటికే ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను విక్రయించాలన్నది లేదా వాటిల్లో ప్రభుత్వపెట్టుబడులను పూర్తిగా, పాక్షికంగా ఉపసంహరించాలన్నది ప్రభుత్వ నిర్ణయం. ప్రభుత్వరంగ సంస్థలు నష్టాల్లో నడుస్తున్నాయని, నష్టాలను ప్రజలపై రుద్దడం సరికాదని, ప్రభుత్వం లక్ష్యం పాలనే కానీ వ్యాపారం కాదని ప్రభుత్వం వాదన. మరి కొత్తగా ఏర్పడబోయే రక్షణ రంగ ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ విధానం వర్తించదా? అవి నష్టాల బాట పట్టబోవని కేంద్రం బలంగా విశ్వసిస్తోందా? ఇలాంటి సందేహాలకు ప్రస్తుతం సమాధానం లేదు.

ఇవీ కొత్త సంస్థలు 

• గ్లైడర్స్ ఇండియా లిమిటెడ్ (డైరెక్టర్లు- ధపోద్కర్ సురేంద్ర, విజయ్ కుమార్ తివారి, సునిల్)

• ఇండియా ఆప్టెల్ లిమిటెడ్ (డైరెక్టర్లు- గిరిష్ చంద్ర అగ్నిహోత్రి, సంజీవ్ కుమార్, సత్యబ్రత ముఖర్జీ)

• మ్యునిషన్స్ ఇండియా లిమిటెడ్ (డైరెక్టర్లు - దేబాశిష్ బెనర్జీ, సుశాంత కుమార్ రౌత్, రవికాంత్)

• అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్ (డైరెక్టర్లు -అనుపమ త్రిపాఠి, రాజేశ్ చౌధరి, అఖిలేశ్ కుమార్ మౌర్య)

• యంత్ర ఇండియా లిమిటెడ్ (డైరెక్టర్లు - వివేక్ బల్వంతరావు వుమాప్, రాజీవ్ పూరీ, గురుదత్తా రే)

• అవని (సాయుధ వాహనాల తయారీ కోసం) • టీసీఎల్ (సైనికుల రక్షణ కోసం ఉపయోగించే సామగ్రి ఉత్పత్తులు