సబ్ రిజిస్ట్రార్ 3గా వీఆర్వోలకే అవకాశం ఇవ్వాలి

• ఏపీ వీఆర్వోల సంఘం డిమాండ్

• వీఆర్వోలపై వేధింపులు పెరిగాయి

• ఎక్కడ తప్పు జరిగినా వారినే బలి చేస్తున్నారని ఆవేదన

 

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్) 

సెప్టెంబరు 24:  గ్రామ రెవెన్యూ అధికారులపై వేధింపులు పెరిగిపోయాయని, ఎక్కడ తప్పు జరిగినా వారినే బలి చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం  ఆవేదన వ్యక్తం చేసింది. అనేక రకమైన పనులతో పని ఒత్తిడికి గురి అవుతున్నారని,  జాబ్ ఛార్టు ప్రకారం రెవెన్యూ విధులు మాత్రమే నిర్వహించాల్సి ఉండగా తమకు సంబంధం లేని ఇతర విభాగాల విధులు కూడా నెత్తిన వేస్తూ తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆక్షేపిచింది.  ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ కు లేఖ రాసింది.  ’’ఎక్కడ తప్పు జరిగినా  వెంటనే వి.ఆర్.ఓ.ల పై చర్య తీసుకుంటున్నారు. దాని వలన గ్రామ రెవెన్యూ అధికారులు అందరూ తీవ్ర మానసిక ఒత్తిడికి గురి అవుతున్నారు.  ఈ  మధ్య కాలంలో విశాఖ, విజయనగరం జిల్లాల్లో మ్యూటేషన్స్ ఫైల్స్, ఇతర సర్వీసులమీద విచారణల పేరులతో వి.ఆర్.ఒ.లను ఏసీబీ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. గుంటూరు జిల్లాలో కూడా బి & యస్.యల్.ఎ. పేరుతో సుమారు 13 మంది వి.ఆర్.ఒ.లను అన్యాయంగా సస్పండ్ చేశారు. వారికి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, వారి తప్పు లేకుండా సస్పండ్ చేయడం చాలా అన్యాయం. దీనిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తోంది. వెంటనే వారిని తిరిగి విధుల్లో తీసుకోవలసిందిగా కోరుతున్నాం. ఎక్కడ తప్పు జరిగినా కేవలం వి.ఆర్.ఒ.లను బలిచేస్తున్నారు. సెలవు దినాలు, పండుగ రోజుల్లో కూడా గ్రామ స్థాయిలో పని చేయించుకుంటూ ఇలా ఇబ్బందులకు గురి చేయడం చాలా బాధకరం. గ్రామ రెవెన్యూ అధికారుల విధులను మాత్రమే నిర్వహించేలా ఇతర శాఖ విధులు గ్రామ రెవెన్యూ అధికారులకు అప్పచెప్పకుండా తగు చర్యలు తీసుకోవలసిందిగా కోరుతున్నాము. గ్రామ సచివాలయాల్లో గ్రామ రెవెన్యూ అధికారులకు ప్రత్యేక గది , కంప్యూటర్ సిస్టం సదుపాయాలు కల్పించాలి. క్యాస్ట్, ఇన్కమ్, రైస్ కార్డు, ఎఫ్.ఎమ్.సి. మ్యూటేషన్స్ తదితర సేవలన్నింటినీ  ఉన్నత అధికారులకు పంపించేలాగా గ్రామ రెవెన్యూ అధికారులకు అందరికి డిజిటల్ "కీ" ఇస్తే ప్రతీ ఫైలు, మా నివేదికలు, సిఫార్సులు సకాలంలో ఉన్నత అధికారులకు పంపించడానికి వీలవుతంది. ఇవ్వన్నీ ఏర్పాటు చేస్తే ఎవరి వల్ల జాప్యమవుతోందో తెలుస్తుంది.  

గ్రామ రెవెన్యూ అధికారులకు బయోమెట్రిక్ ఎక్కడైనా వేసే వెసులుబాటు కల్సించాలని పలుసార్లు కోరినా ఫలితం లేకుండా పోయింది. క్షేత్రస్థాయిలో పని చేస్తూ టైమ్తో సంబంధం లేకుండా విధులు నిర్వహిస్తున్న తమకు బయోమెట్రిక్ విషయములో వెసులుబాటు లేనందున తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాము. కాబట్టి  దీని పై చర్యలు తీసుకోవలసిందిగా కోరుతున్నాం.

ఈ మధ్యకాలంలో ప్రభుత్వం 154 జీవో ద్వారా గ్రామ రెవెన్యూ అధికారులకు సీనియర్ సహాయకులుగా 60:40 % నిష్పత్తిలో పదోన్నతులు కల్పించింది. దీని వలన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ రెవెన్యూ అధికారులకు అన్యాయం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 350 మందికి మాత్రమే పదోన్నతులు పొందుతున్నారు. ఇంకా అర్హత ఉన్న వారు చాలా మంది ఉన్నారు. ప్రభుత్వం గ్రామ సచివాలయాలలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటోంది. దానిలో భాగంగా గ్రామ స్థాయిలో భూముల మీద పూర్తి అవగాహన ఉన్న గ్రామ రెవెన్యూ అధికారులను సచివాలయాల్లో సబ్ రిజిస్ట్రార్ 3గా అవకాశం కల్పిస్తే ఎక్కువ మంది గ్రామ రెవెన్యూ అధికారులకు సీనియర్ సహాయకులుగా న్యాయం జరగుతుంది. భూమి మీద ఎటువంటి అనుభవం లేని పంచాయితీ కార్యదర్శికి సబ్ రిజిస్ట్రారు 3 గా అవకాశం ఇవ్వడం చాలా అన్యాయం. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి గ్రామ సచివాలయాల్లో సబ్ రిజిస్ట్రారు 3 గా గ్రామ రెవెన్యూ అధికారులను నియమించేలాగా తగు చర్యలు తీసుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.‘‘ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు రవీంద్రరాజు, ప్రధానకార్యదర్శ అప్పలనాయుడు ఒక ప్రకటనలో కోరారు.