పీఆర్సీపై మార్గసూచి ముఖ్యమంత్రికి?


ఇప్పటికే సమర్పించిన సీఎస్
(ఉద్యోగులు.న్యూస్) ( ఉద్యోగులు.కామ్)
సెప్టెంబరు 25- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎప్పటి నుంచో పీఆర్సీ అమలు కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వేతన సవరణ కమిషన్ తన నివేదిక సమర్పించి దాదాపు ఏడాది పూర్తి కావస్తోంది. పీఆర్సీ అమలుపై ప్రభుత్వం కొంత సీరియస్ గానే దృష్టా సారించిందని, ఇందుకోసం మార్గసూచి తయారు చేసే పనిలో ఉన్నతస్థాయి వ్యక్తులు నిమగ్నమయ్యారని ‘ ఉద్యోగులు.న్యూస్’ ఇంతకుముందే పేర్కొంది. పీఆర్సీని ఎలా అమలు చేయాలి? అన్న విషయంలో ఇప్పటికే ఉన్నతస్థాయి అధికారులు ఆ మార్గసూచిని నివేదిక రూపంలో సిద్ధం చేసినట్లు సమాచారం. అంతే కాదు ఆ మార్గసూచి ని ముఖ్యమంత్రికి కూడా సమర్పించారు. ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయబోతున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఈ విషయంలో చొరవ తీసుకుని-ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో చర్చించి అవసరమైన సమాచారం తీసుకున్నారని తెలిసింది. పీఆర్సీ సిఫార్సులపై పరిశీలన జరిపిన సీఎస్, ఆర్థికశాఖ అధికారులు, మరికొందరితో చర్చించి రోడ్డుమ్యాప్ నకు తుది రూపు ఇచ్చారు. ‘‘ పీఆర్సీ ఎలా అమలు చేయాలో ఇప్పటికే ముఖ్యమంత్రికి రోడ్డు మ్యాప్ ఇచ్చాం’’ అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కొందరికి చెప్పినట్లు తెలిసింది. పీఆర్సీ అమలుకు ఉన్న మార్గాలు ఏమిటి? ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఎలా ముందడుగు వేయాలి? పీఆర్సీ వల్ల ప్రభుత్వంపై ఎంత భారం పడబోతోంది? ఇందుకు ఉన్న మార్గాలు ఏమిటి? ఇప్పటికే ఐఆర్ రూపంలో ఉన్న భారం ఎంత- అదనంగా ఎంత భారం కానుంది అన్న పరిశీలన మొత్తం పూర్తయిందని, అమలుకు సులభమైన మార్గాలు వివరించడంతో పాటు అమలు విధానానికి రెండు, మూడు ప్రత్యామ్నాయాలు కూడా సూచించినట్లు తెలిసింది. ఇప్పటికే ప్రభుత్వం 27శాతం ఐఆర్ అమలు చేస్తోంది. వేతన సవరణ కమిషన్ కూడా అంతే మొత్తానికి ఫిట్ మెంటు సిఫార్సు చేసినట్లు తెలిసింది.