ఉద్యోగ విరమణకు ముందు పుట్టిన రోజు మార్పు కుదరదు

 

•   సుప్రీం  కోర్టు తీర్పు

 

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్) 

సెప్టెంబరు 25:  ఉద్యోగుల పదవీ విరమణకు సంబంధించి సుప్రీం కోర్టు ముఖ్యమైన తీర్పు వెలువరించింది. ఉద్యోగంలో చేరిన చాలా సంవత్సరాల తర్వాత.. అందులోనూ సర్వీసు చివరిలో పుట్టిన రోజులో మార్పులు చేసుకుంటామంటే కుదరదని స్పష్టం చేసింది. సర్వీసు రికార్డులో నమోదయిన పుట్టినరోజులో తప్పు ఉందని, సరైన పుట్టినరోజు ఫలానా తేదీ అని ఆధారాలున్నా సరే అసాధారణ జాప్యమయితే మార్పు కుదరదని తేల్చి చెప్పింది. 

కర్ణాటక గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థకు చెందిన ఒక ఉద్యోగి కేసులో ఇటీవల ఈ తీర్పు వెలువరించింది. ఆ ఉద్యోగి సర్వీసులో చేరినప్పుడు పుట్టినరోజు ఎస్ఎస్ఎల్సీ మార్కుల జాబితా ఆధారంగా  04.01.1960 గా నమోదు అయింది. అయితే ఉద్యోగ విరమణకు ముందుగా అంటే 23‌-06-2007లో మొదటిసారి పుట్టినరోజు మార్పు కోరుతూ దరఖాస్తు చేశారు. పుట్టిన రోజును  24-01-1961గా మార్చాలని విజ్ఞప్తి చేశారు.  సర్వీసు నిబంధనల ప్రకారం ఉద్యోగంలో చేరిన మూడేళ్లలోపు లేదంటే కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగుల వయసు నిర్ధారణ చట్టం -1974 అమల్లోకి వచ్చిన తర్వాత ఏడాదిలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుదని చెబుతూ కర్ణాటక గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఆ ఉద్యోగి దరఖాస్తును తిరస్కరించింది. ఆయన స్థానిక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆ న్యాయస్థానం ఆయన విజ్ఞప్తిని తిరస్కరించింది. దీంతో ఆ ఉద్యోగి కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో కర్ణాటక గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయిచింది. సుప్రీంకోర్టు.. హైకోర్టు తీర్పును కొట్టేసింది.  అసలైన పుట్టిన రోజుకు ఆధారాలున్నా సరే.. సర్వీసు రికార్డుల్లో పుట్టినరోజు మార్పునకు ఉన్న అవకాశాన్ని హక్కుగా భావించరాదని స్పష్టం చేసింది. ఇటువంటి విజ్ఞప్తులను జాప్యం కారణంగా..ముఖ్యంగా సర్వీసు చివరికాలంలో అంటే సరిగ్గా ఉద్యోగ విరమణకు ముందు దరఖాస్తు చేస్తే  తిరస్కరించవచ్చని తేల్చి చెప్పింది.