ప్రజా స్వామ్యంలో ప్రశ్నించడం తప్పా?
 

•    ఇచ్చిన హామీలను జగన్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు
•    ఇదే ప్రశ్నిస్తే తప్పెలా అవుతుంది
•     మల్లాది విష్ణు వ్యాఖ్యలను ఖండించిన ఫ్యాఫ్టో

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్) 
సెప్టెంబరు 25:  ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రశ్నించడం తప్పా అని ఫ్యాప్టో ప్రశ్నించింది. నవరత్నాల అమలులో ఉద్యోగులు ఒక భాగమేనని,  పీఆర్సీ,  డి.ఎ.లు, సిపిఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ తదితర అంశాలు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలేనని, వాటిని  అమలు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు,  శాసన మండలి సభ్యుడు ఐ. వెంకటేశ్వరరావు ప్రశ్నించడాన్ని శాసన సభ్యుడు మల్లాది విష్ణువర్ధన్ భరించలేకపోవడం ప్రజాస్వామ్యంలో సరైన పద్ధతి కాదని రాష్ట్ర ఫ్యాప్టో ఛైర్మన్ సిహెచ్ జోసఫ్ సుధీర్ బాబు, సెక్రటరీ జనరల్ సిహెచ్. శరత్ చంద్ర విమర్శించారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలు,  ప్రజా సమస్యల పట్ల నిస్వార్థంగా పనిచేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ ప్రజల పక్షాన ఉద్యమాల్లో భాగస్వాములైన ఎంఎల్సీల పట్ల అధికార పార్టీ వైఖరి సరికాదని ఖండించారు. ప్రతిపక్ష ప్రజా ప్రతినిధులు ఉద్యోగ, ఉపాధ్యాయ ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు తగిన విధంగా సమాధానం చెప్పాలే తప్ప బెదిరింపు ధోరణిలో, అధికార దర్బంతో మాట్లాడడం తగదన్నారు. జగన్  ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తయినా ఉద్యోగులకు ఇచ్చిన పలు హామీలను నేటికి నెరవేర్చలేదని విమర్శించారు.  ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పిన ప్రతివ్రజానిధులను ప్రశ్నిస్తే తప్పుపట్టడం సరైన విధానం కాదని ఫ్యాప్టో నాయకులు విమర్శించారు. ఇప్పటికైనా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను అమలు పర్చాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల కోసం ప్రశ్నించే శాసన మందలి సభ్యులను బెదిరించటం మానుకోవాలని హితవు పలికారు. ఇలాంటి అంశాలు భవిష్యత్తులో కూడా పునారవృతం అయితే ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల నుంచి తీవ్ర నిరసనను ఎదుర్కోవాల్సి వస్తుందని ఫ్యాప్టో నాయకులు హెచ్చరించారు.