పెన్ డౌన్ కు వ్యవసాయాధికారుల సంఘం అల్టిమేటం
 

- కమిషనర్ తీరుపై ఆగ్రహం
-   ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
అక్టోబరు 9 -  ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ కమిషనర్  తీరుపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయాధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన తీరుపై ఇప్పటికే అనేక సార్లు తాము ఫిర్యాదు చేశామని, ఇప్పటికీ ఆయన వైఖరి మారలేదని రైతు భరోసా కేంద్రాల చీఫ్ కమిషనర్, వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్యలకు వారు శుక్రవారం ఫిర్యాదు చేశారు.  తక్షణం ఆయనపై చర్యలు తీసుకోకుంటే ఆందోళన కార్యక్రమాలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. అక్టోబరు 11 నుంచి నల్లబ్యాడ్జీల ప్రదర్శన చేస్తామన్నారు. అక్టోబరు 18 నుంచి భోజన విరామ సమయంలో ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు.  మండల, జిల్లా కేంద్రాల నుంచి రాష్ర్ట స్థాయి వరకు ఈ ఆందోళన సాగుతుంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకుంటే అక్టోబరు 25 నుంచి పెన్ డౌన్ కు నిర్ణయించారు.
 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు వంటి ముఖ్యమంత్రి ఆలోచనలను అమలు చేయడంలో తమ అధికారులంతా  కష్టపడి పని చేస్తోంటే వ్యవసాయశాఖ కమిషనర్ తమతో వ్యవహరించే తీరు చాలా అభ్యంతరకరంగా ఉంటోందని వారు ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు.
రైతుల సేవలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా తాము కమిషనర్ తీరుపై నిరసన వ్యక్తం చేయడం తప్ప తమకు మరోమార్గం లేదని వారు పేర్కొన్నారు. కమిషనర్ తీరుపై అనేక ఫిర్యాదులు చేశారు. 
- క్యాడర్, జెండర్ తో సంబంధం లేకుండా అందరు అధికారులతో ఆయన  ఉపయోగించే  భాష, వ్యవహరించే తీరు అభ్యంతరకరంగా ఉంటోంది.
- రైతు  భరోసా కేంద్రం నుంచి  హెడ్ ఆఫీసు వరకు వాట్సాప్ లోనే పాలన సాగుతోంది. అన్ని స్థాయిల ఉద్యోగులు, అధికారులను వేధిస్తున్నారు.
- మహిళా ఉద్యోగినులపై ఆయనకు ఎలాంటి సానుభూతి లేదు. సర్వీసు అంశాల్లో ఏదైనా సాయం కోరితే రాజీనామా చేయమంటున్నారు.
- ఎరువులు, క్రిమిసంహారక మందుల లైసెన్సుకు ఆయన ఆన్ లైన్ విధానాన్ని తొలగించడంతో అందుకు విపరీత జాప్యం జరుగుతోంది.
- నియంత్రణాధికారాలు ఉన్న అధికారులను అన్నింటికీ అనుమానిస్తూ  తప్పు జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేకున్నా ఇబ్బంది పెడుతున్నారు. అధికారుల స్థయిర్యం, ఆత్మాభిమానం దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారు.
- పనులు చేసేందుకు  ఎలాంటి సమయమూ ఇవ్వకుండానే తరచు టెలీకాన్ఫరెన్సులు  నిర్వహిస్తున్నారు.
- ప్రమోషన్ల వంటి ఉద్యోగుల సర్వీసు అంశాలను ఎంత మాత్రం పట్టించుకోరు.