సజ్జల మమ్మల్ని బెదిరించలేదు

 

-ఫ్రెండ్లీ ప్రభుత్వంలో ఘర్షణ వద్దన్నారు

- మేం ఉద్యోగులం ప్రభుత్వ పరిధిలోనే ఉంటాం

- మా డిమాండ్లు నెరవేర్చకుంటే పోరాటం తప్పదు

- ఉద్యోగ నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)

అక్టోబరు 9- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మమ్మల్ని బెదిరించలేదని, ఆ రోజు ఫోన్ కాల్ పై సాగుతున్న ప్రచారం తప్పడు ప్రచారమేనని ఏపీ ఎన్ జీ వో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్య వేదిక ఛైర్మన్ బండి శ్రీనివాసరావు పేర్కొన్నారు. అమరావతి జేఏసీ, ఎన్ జీ వో జేఏసీ ఆ రోజు నిర్వహించిన ప్రెస్ మీట్ సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ చేశారని- రెండు జేఏసీలు కలుస్తున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారే తప్ప వేరే ఏమీ కాదని పేర్కొన్నారు. విజయవాడ లోని ఎన్ జీవో ప్రధాన కార్యాలయంలో బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు ఈ విషయం శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సజ్జల రామకృష్ణారెడ్డి మమ్మల్ని కంట్రోల్ లో ఉండమని చెప్పలేదు. బెదిరించలేదు. ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉన్నామన్న విషయాన్ని గుర్తు చేశారే తప్ప శుభాకాంక్షలు చెప్పారే తప్ప బెదిరించారనడం సరికాదు అని బండి శ్రీనివాసరావు అన్నారు.

’’ మాకు ఫోన్ చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి సారే. ఈ రాష్ర్టంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అనుసంధానం చేస్తున్నది ఎవరైనా ఉంటే అది సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే. ముఖ్యమంత్రి వద్ద ఆయనకు ఎంత పలుకుబడి ఉన్నా ఉద్యోగులను సోదర భావంతో ఉండే వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి మమ్మల్ని బెదిరించే అవకాశం కానీ, పరిస్థితులు కానీ లేవు. సహృదయంతో, మాకు ఉన్న అనుబంధం వల్ల మాత్రమే మాకు ఫోన్ చేశారు. రెండు అతి పెద్ద జేఏసీలు కలుస్తున్న సందర్భంగా శుభాకాంక్షలు చెప్పారు. అంతే’’ అని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.

రెండు బలమైన సంఘాలు ఏకమై బలంగా ముందుకు వస్తున్నప్పుడు అలా ప్రభుత్వం తరఫున మాట్లాడటం సహజం. మేం ఎక్కడైనా ఉద్యోగుల సమస్యలను తక్కువ చేసి మాట్లాడింది ఏమైనా ఉందా? అని బొప్పరాజు ప్రశ్నించారు. మేం రాజకీయ పార్టీలం కాదు- ఉద్యోగులం ప్రభుత్వానికి లోబడే ఉంటాం. ప్రభుత్వం వద్ద సానుకూల ధోరణిలో సమస్యలు పరిష్కరించుకుంటాం. ఒక వేళ ప్రభుత్వం పట్టించుకపోతే పోరాటం చేస్తామని కూడా బొప్పరాజు హెచ్చరించారు. ప్రభుత్వానికి వీలైనంత సమయం ఇచ్చాం. ఇక వేచి చూసేది లేదు అని ఆయన స్పష్టం చేశారు.