బకాయిలు అందక పీటీడీ ఉద్యోగుల ఆందోళన

- వెంటనే చెల్లించే ఏర్పాట్లు చేయాలి

-  ఎంప్లాయిస్ యూనియన్ నాయకుల డిమాండ్

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్) అక్టోబరు 12 -  ఆర్టీసీ జేఏసీతో గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం ఆర్టీసీ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలన్నీ తక్షణమే చెల్లించాలని  ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వలిశెట్టి దామోదరరావు, వై వి రావులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు రవాణాశాఖ మంత్రి, ముఖ్య కార్యదర్శి, కమిషనర్, ఆర్టీసీ ఎండీలను మంగళవారం కలిశారు. వినతిపత్రాలు సమర్పించారు.   ఉద్యోగులు ఏపీఎస్ ఆర్టీసీలో ఉన్నప్పుడు  నాలుగేళ్లకు ఒకసారి వేతన సవరణ చేసేవారని, 2017 ఏప్రిల్ ఒకటి నుంచి చేయాల్సిన వేతన సవరణపై నాడు జేఏసీ ఆర్టీసీ యాజమాన్యంతో ఒప్పందం చేసుకుందని వారు వివరించారు. 2019 ఫిబ్రవరి నెలలో ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలోని జేఏసీతో యాజమాన్యం చర్చించి ఒప్పందాలు చేసుకున్న విషయాన్ని వారు గుర్తు చేశారు. ప్రస్తుతం రెండు  2020-21, 2021-22 సంవత్సరాలకు లీవు ఎన్ క్యాష్ మెంటుకు ప్రభుత్వాన్ని ఒప్పించినందుకు ఎండీ ద్వారకాతిరుమల రావుకు వారు ధన్యవాదాలు తెలియజేశారు. 2017 నుంచి 2019 వరకు లీవు ఎన్ క్యాష్ మెంటుకు కూడా గతంలోనే అంగీకరించినందున అది కూడా ఇప్పించాలని వారు కోరారు. వివిధ కారణాలతో పదవీ విరమణ చేసిన, చనిపోయిన ఉద్యోగులకు సంబంధించి పెన్షన్  లు ఇంకా అందడం లేదని  వారు వినతిపత్రంలో పేర్కొన్నారు. అవి అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.