దసరా సందర్భంగా 43శాతం ఫిట్మెంట్ ప్రకటించండి

 

• పీఆర్సీ నివేదికను వెల్లండించి, ఇతర సిఫార్సులను అమలు చేయండి

• ప్రభుత్వానికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి

 

 (ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్) 

అక్టోబరు 12: విజయదశమి సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్రభుత్వప్రధాన కార్యదర్శికి సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎన్. ప్రసాద్ లేఖ రాశారు. 11వ పీఆర్సీ సిఫార్సుల మేరకు ప్రభుత్వఉద్యోగులకు 1-07-2018 నుంచి వేతన సవరణ జరగాలని ఈ లేఖలో వారు గుర్తు చేశారు. ఏడాది క్రితమే ప్రభుత్వానికి పీఆర్సీపై నివేదిక అందిందని పేర్కొన్నారు. ప్రతి ఐదేళ్లకొకసారి సవరించాల్సిన వేతన స్కేళ్లలో జాప్యం కారణంగా ఉద్యోగులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు గత రెండేళ్లలో కరోనా మహమ్మారి కారణంగా పలువురు ఉద్యోగుల కుటుంబాలు ఆస్పత్రి పాలయ్యాయని, వైద్య చికిత్సకు పెద్ద ఎత్తున ఖర్చయిందని తెలిపారు. దీనికి తోడు నిత్యావసరాల ధరలు, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు, రవాణా ఛార్జీలు భారీగా పెరగడంతో కుటుంబ నిర్వహణ ఖర్చులు మోయలేని భారమయ్యాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలతో చర్చలకు వీలుగా 11వ పీఆర్సీ సిఫార్సులను వెల్లడించాలని సంబంధిత అధికారులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. విజయదశమి సందర్భంగా 43శాతానికి తగ్గకుండా ఫిట్ మెంట్ ప్రకటించాలని, పీఆర్సీ చేసిన ఇతర సిఫార్సులను కూడా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.