తక్షణం పరిష్కరించక పోతే పోరాటం తప్పదు
 

•    దశల వారీ ఉద్యమానికి సిద్ధంగా ఉన్నాం
•    దసరా కానుకగా పీఆర్సీ ప్రకటించాలి   
•    ఏపీ జేఏసీ, ఏపీ జేఏసి అమరావతి ఐక్యవేదిక స్పష్టీకరణ
•     సజ్జల, సమీర్ శర్మను కలిసి సమస్యలు వివరించిన నేతలు

 (ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్) 
అక్టోబరు 12:  దసరా కానుకగా పీఆర్సీ ప్రకటించాలని  ఏపీ జేఏసీ, ఏపీ జేఏసి అమరావతి నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.  లేనిపక్షంలో దశల వారీగా పోరాటాలు చేయడానికి రెండు జేఏసీలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి,  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మను బండి శ్రీనివాసరావు నేతృత్వంలోని ఏపీజేఏసీ, బొప్పరాజు వెంకటేశ్వర్లు నేతృత్వంలోని ఏపీజేఏసీ అమరావతి నేతలు సోమవారం కలిసి ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను కూలంకషంగా వివరించారుఎంతోకాలంగా సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని దానివలన ఉద్యోగులలో ఉద్యోగుల సంఘాల పట్ల, ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తి  ఏర్పడుతోందని వారు సజ్జల, సమీర్ శర్మ దృష్టికి తీసుకెళ్లారు.  దీంతో దీర్ఘకాల అపరిష్కృత సమస్యల సాధనకు ఏపీ జేఏసీ, ఏపీ జేఏసి అమరావతి ఐక్యవేదికగా ఏర్పడ్డాయని చెప్పారు.  ఐక్య వేదిక ద్వారా మొదటి మెమొరాండం సజ్జలకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇచ్చారు. ఇద్దరూ  తక్షణమే చొరవతీసుకొని ముఖ్యమంత్రితో చర్చించి దసరా కానుకగా పీఆర్సీ  ప్రకటించాలని కోరారు. 
సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందిస్తూ  ప్రధాన సమస్యలపై ఇప్పటికే ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో రెండు, మూడు దఫాలుగా చర్చించారని, అవన్నీ చివరి దశలో ఉన్నాయని, రెండు జేఏసీలు కలిసి వచ్చినందున తక్షణమే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి, ఒకటి రెండు రోజుల్లో ఈ సమస్యలపై సానుకూలంగా నిర్ణయం ప్రకటించేవిధంగా చేస్తామని హామీ ఇచ్చారు.  
ప్రభుత్వ సంక్షేమ పథకాలను కరోనా కష్ట కాలంలో కూడా ఎన్నో వ్యయ ప్రయాసలకు లోనై అమలు చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, నిర్లక్ష్యం చూపిస్తుందనే భావన ప్రతీ ఉద్యోగిలోనూ  ఉందని తెలిపారు.  తమ న్యాయ పరమైన చిన్న చిన్న కోర్కెలను కూడా ప్రభుత్వం రెండు సంవత్సరాలుగా పరిష్కరించడం లేదనే భావన ఉద్యోగ వర్గాలలో ఉందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి వివరించగా, ఆయన స్పందిస్తూ తక్షణమే ఈ డిమాండ్లను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి, సంబంధిత ఉన్నతాధికారులతో చర్చించి వీలయినంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
సజ్జలను, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిను కలిసిన వారిలో ఏపీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి. శివారెడ్డి, ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కోశాధికారి వి వి మురళీకృష్ణ నాయుడు, రాష్ట్ర మునిసిపల్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి దొప్పలపూడి ఈశ్వర్, ఏపీఆర్ఎస్ఏ ఉపాధ్యక్షుడు  ఆర్.వి. రాజేశ్ , రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయబాబు, రంగారావు, ఏపీఎన్జీవోల సంఘం రాష్ట్ర కార్యదర్శి తదితరులు ఉన్నారు.


సజ్జల, సమీర్ శర్మతో చర్చించిన సమస్యలు
 1 . ఒకటో తేదీన ఉద్యోగ ఉపాధ్యాయులకు, కాంట్రాక్టు ఉద్యోగులకు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్లు చెల్లించలేని ఆర్థికశాఖ తీరును తీవ్రంగా గర్హిస్తున్నాం.  ముఖ్యంగా పెన్షన్లు సకాలంలో రాక పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  పోలీసుశాఖతో సహా వివిధ శాఖల్లో సరెండర్ లీవ్ ఎన్ క్యాష్మెంట్ తో పాటు, ఉద్యోగ విరమణ చేసిన, చేయబోతున్న వారికి రావలసిన ఆర్థిక పరమైన సౌకర్యాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెన్షన్లు, గ్రాట్యుటీ,జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ క్లెయిములు, ఏపీజీఎల్ఐ రుణాలు,    వైద్య ఖర్చులు, దహన సంస్కారాల ఖర్చులు (మట్టి ఖర్చులు)  సంవత్సర కాలంగా రాక, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటిని వెంటనే చెల్లించాలి.  కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న రీతిగా ప్రతి నెల మొదట తేదీనే విధిగా, పెన్షనర్లకు ఉద్యోగులకు జీతాలు చెల్లించే విధంగా ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శికి  ఆదేశాలు ఇవ్వాలి. ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న ఉద్యోగులకు సంబంధించిన  బిల్లులను వెంటనే విడుదల చేయాలి. 

 2 . పీఆర్సీ కమిషన్ నివేదిక ఇచ్చి చాలాకాలం అయింది.  ఈ సంవత్సరం దసరా లోపు 11వ  పీఆర్సీని ఎటువంటి జాప్యం లేకుండా ప్రకటించాలి.
 3 . ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన రీతిగా సీపీఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. 
 4 . 01-07-2018 నుంచి పెండింగ్ లో ఉన్న డీఏలలో రెండు డీఏలు.. అంటే.. 01-07-2018,  01-01-2019 డీఏలను, 01-07-2018 నుంచి 01-07-2021 వరకు ఇవ్వవలసిన మిగిలిన ఐదు డీఏ లను   ఈ ఏడాది డిసెంబరు 31లోపు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు చెల్లించాలి. 
5 .  గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన లోపభుయీష్టమైన సి.ఎఫ్.ఎం.ఎస్(CFMS) విధానాన్ని రద్దు చేయాలి. 
6 . జిల్లా సెలెక్ట్ కమిటీల ద్వారా ఆర్వోఆర్ ప్రకారం ఎంపికై పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను తక్షణమే క్రమబద్ధీకరించాలి. కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయాలి. 
 7 . ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ ద్వారా ఉద్యోగులకు ఎటువంటి ప్రయోజనం చేకూరడం లేదు.  నెట్ వర్క్ ఆస్పత్రులను ప్రభుత్వం సరిగా నియంత్రించలేకపోవడం వలన ఉద్యోగులు అధిక మొత్తాలు చెల్లించి వైద్యం చేయించుకోవాల్సి వస్తోంది.  కానీ రీయంబర్స్మెంట్ ద్వారా తక్కువ మొత్తమే అందుతోంది.  అందువల్ల ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ ను రద్దుపరచి, ప్రభుత్వం ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా ప్రభుత్వ అజమాయిషీతో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఉచిత వైద్య సదుపాయాలు(Cashless Treatment)  కల్పించాలి. 
 8 . ప్రస్తుత ధరవరలను బట్టి కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను వెంటనే పెంచాలి. 
9 . కొన్ని ప్రభుత్వ శాఖలలో గల కార్యదర్శులు ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, పురపాలక శాఖలలో శాఖాపరమైన పదోన్నతులు కల్పించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు.  దీని వల్ల  సంవత్సరాల తరబడి పదోన్నతులు పెండింగ్లో ఉన్నాయి. వెంటనూ  వాటిపై చర్యలు తీసుకోవాలి. 
 10 . కోవిడ్ వలన మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలి.