జీతమో ’రామ‘చంద్రా


•    ఒకటో తేదీన జీతాలు, పెన్షన్లు అందక అవస్థలు
•    ఏడాదిగా దహనసంస్కారాల డబ్బూ అందడం లేదు
•    సకాలంలో జీతాలు చెల్లించాలని ఆదేశించండి
•     ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నేతల వినతి

 (ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్) 
అక్టోబరు 12:  ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు చెల్లించలేకపోతున్న అంశం మరోసారి ప్రధానంగా చర్చకు వచ్చింది.  ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి,  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మను బండి శ్రీనివాసరావు నేతృత్వంలోని ఏపీజేఏసీ, బొప్పరాజు వెంకటేశ్వర్లు నేతృత్వంలోని ఏపీ జేఏసీ అమరావతి నేతలు సోమవారం కలిసినప్పుడు జీతాలు, పెన్షన్లు సకాలంలో రాక ఉద్యోగులు పడుతున్న అవస్థలను వివరించారు. ఒకటో తేదీన ఉద్యోగ ఉపాధ్యాయులకు, కాంట్రాక్టు ఉద్యోగులకు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్లు చెల్లించలేని ఆర్థికశాఖ తీరును తీవ్రంగా గర్హిస్తున్నట్లు స్పష్టం చేశారు.  ఉద్యోగ విరమణ చేసిన, చేయబోతున్న వారికి రావలసిన ఆర్థిక పరమైన సౌకర్యాలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తీరును వివరించారు. పెన్షన్లు, గ్రాట్యుటీ,జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ క్లెయిములు, ఏపీజీఎల్ఐ రుణాలు,   వైద్య ఖర్చులు, దహన సంస్కారాల ఖర్చులు (మట్టి ఖర్చులు)  సంవత్సర కాలంగా రాక, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.    కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న రీతిగా ప్రతి నెల మొదట తేదీనే విధిగా, పెన్షనర్లకు ఉద్యోగులకు జీతాలు చెల్లించే విధంగా ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శికి  ఆదేశాలు ఇవ్వాలని కోరారు.