ఉపాధ్యాయుల అక్రమ డిప్యుటేషన్లు రద్దు చేయాలి
 

•    చిత్తూరులో యూటీఎఫ్ ధర్నా  

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్) 
అక్టోబరు 12:  చిత్తూరు జిల్లాలో అక్రమంగా వేసిన డిప్యుటేషన్ లను తక్షణమే రద్దు చేయాలని యూటీఎఫ్ మంగళవారం చిత్తూరు డిఈఓ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేసింది.  ఈ సందర్భంగా ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి రెడ్డి మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో మూడు నెలలుగా అక్రమంగా అనేక మంది ఉపాధ్యాయులను వారికి అనుకూలమైన పాఠశాలలకు  డిప్యుటేషన్ వేశారని, దీనివల్ల ఇప్పటికే ఉపాధ్యాయుల కొరతతో ఇబ్బంది పడుతున్న పాఠశాలలు మరింత కష్టాల్లోకి కూరుకుపోయాయని అన్నారు. 
మారుమూల పాఠశాలల్లో ఉండాల్సిన ఉపాధ్యాయులను అధికారులు నిబంధనలకు తూట్లు పొడిచి సిపార్సులతో పట్టణ ప్రాంతాల్లోకి  డిప్యుటేషన్ వేశారని, ఆ  డిప్యుటేషన్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ధర్నాలో ముఖ్య అతిథిగా పాల్గొన్న యూటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు బాబు రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఏ జిల్లాలో లేని విధంగా చిత్తూరు జిల్లాలో రాజకీయ ప్రోద్బలంతో డిప్యుటేషన్ లను వేశారని,  దీనివల్ల విద్యావ్యవస్థలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వెలిబుచ్చారు.
ఉపాధ్యాయులు కౌన్సెలింగ్ ద్వారా సాధించుకున్న హక్కులకు తూట్లు పొడుస్తూ నిబంధనలకు వ్యతిరేకంగా  డిప్యుటేషన్ లను వేశారని, దీనివల్ల అవసరమైన చోట ఉపాధ్యాయులు లేకుండా పోవడం, అవసరం లేని చోట ఎక్కువగా ఉండడం జరిగిందని చెప్పారు. ఇలాంటి డిప్యూటేషన్ లను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 
యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రఘుపతి రెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముత్యాల రెడ్డి,  జీ వి రమణ లు మాట్లాడుతూ డీఈఓ కార్యాలయంలో సీనియారిటీ లిస్టుల తయారీలో జరిగిన అవకతవకలను సరిదిద్దాలని,  మార్కుల ప్రాతిపదికగా సీనియార్టీ జాబితా తయారు చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ డిప్యూటేషన్ ల పైన ఇప్పటికే ఎన్నోసార్లు డీఈవోకు విన్నవించామని ,  అయినప్పటికీ ఇప్పటి వరకు కనీసం స్పందన లేదని విచారం వ్యక్తం చేశారు. అందుకే  పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా వాటిని రద్దు చేయాలని,  లేకుంటే భవిష్యత్తులో ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకుంటామని ప్రకటించారు..
ఈ ధర్నా కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. జిల్లా గౌరవ అధ్యక్షుడు సుధాకర్ నాయుడు, రాష్ట్ర ఆడిటర్ ఎస్ నాయుడు, జిల్లా సహధ్యక్షులు నిర్మల, సూర్యప్రకాశ్, కోశాధికారి రమేశ్ నాయుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పద్మజ, మధు తో పాటు జిల్లా కార్యదర్శులు, రాష్ట్ర కౌన్సిలర్లు హాజరయ్యారు.
ధర్నా విషయాన్ని కలెక్టర్ దృష్టికి యండపల్లి తీసుకెళ్లగా కలెక్టర్ వెంటనే స్పందించి డీఈఓతో  మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు...
యూ టీ ఎఫ్ ధర్నా శిబిరానికి వచ్చిన డీఈఓ పురుషోత్తం మాట్లాడుతూ డిప్యుటేషన్ లపై వెంటనే సమీక్ష జరిపి అసంబద్ధంగా జరిగి ఉంటే వెంటనే రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ సూచనలకనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.