Thursday 24th June 2021

రాలిపోతున్న కాంట్రాక్టు ఉద్యోగులు !

*ప్రభుత్వం తక్షణమే స్పందించాలి

 (ఉద్యోగులు న్యూస్) జూన్ 1- రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం రెండోరోజు వైద్య ఆరోగ్య శాఖ లోని కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగుల నిరసన కార్యక్రమాలు మరింత ఊపందుకున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆంధ్రప్రదేశ్ డి.ఎస్.సి కాంట్రాక్టు పారామెడికల్  ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి (జె.ఏ.సి) రాష్ట్ర కన్వీనర్ జి.వి.వి.ప్రసాద్ మంగళవారం సాయంత్రం  విలేకరులకు వివరించారు.  రెగ్యులర్ చేసి తీరుతామన్న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి మాట నెరవేరక ముందే కాంట్రాక్టు ఉద్యోగులు పిట్టల్లా రాలిపోతున్నారని, కరోనా సేవల్లో కోవిడ్ సోకి కొందరు..కాంట్రాక్టు లో ఉన్న తాము ఛస్తే తమ కుటుంబానికి భరోసా ఏంటని మానసికంగా బాధపడుతూ  ఇంకొందరు.... ఇలా ఎందరో ప్రాణత్యాగాలు చేస్తున్నా కాంట్రాక్టు ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి కనికరమే లేకుండా పోతోందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.  అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసి తీరుతామని చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట నెరేవేరే లోపే ఎందరో కాంట్రాక్టు ఉద్యోగులు ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

వైద్య ఆరోగ్య శాఖకు చెందిన పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతం కు చెందిన ఇరగవరం పి.హెచ్.సి లో కాంట్రాక్టు హెల్త్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న వీరవల్లి శ్రీధర్ కుమార్ రోడ్డు ప్రమాదంలో గురై సోమవారం దుర్మరణం పలుకావడం తమను తీవ్రంగా కలచివేసిందన్నారు. గత నెలలో కోవిడ్ తో  తూర్పు, పశ్చిమ గోదావరిజిల్లాల్లో ముగ్గురు,  అంతకుముందు  తూర్పుగోదావరి జిల్లాలో ప్రమాదాలకు గురై ఒకే వారంలో ఇద్దరు, అంతక్రితం  ప్రకాశం జిల్లాలో కొద్ది కాలంలోనే ఇద్దరు ఇలా గడిచిన ఏడాది కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టు హెల్త్ అసిస్టెంట్లు ఎందరో వరుస మరణాలకు గురయ్యారని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో రెగ్యులర్ ఉద్యోగాల నియామకాల వలే పేపర్ నోటిఫికేషన్, డి.ఎస్.సి ద్వారా రాత పరీక్ష, ఆర్డర్ ఆఫ్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ పాయింట్ తో క్లియర్ వేకెంట్ సెంక్షన్డ్ పోస్టుల్లో పక్కా విధివిధానాలతో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 16 కి లోబడి నియామకమయ్యామని ప్రసాద్ వివరించారు. అంతకన్నా మించి తాము ట్రెజరీ ద్వారా నూరుశాతం వేతనాలను పొందుతూ విధులు నిర్వహించే తమకు గత ప్రభుత్వం చేసిన మోసానికి బలైపోయామన్నారు. అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసి తీరుతామని చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  రెండేళ్లు పూర్తయినా ఆయన మాట మాటగానే మిగిలిపోయిందన్నారు. అన్ని అర్హతలున్నా తమను తప్పకుండా రెగ్యులర్ చేస్తారని జగనన్న పై గంపెడాశలు పెట్టుకున్నా నేటికీ రెగ్యులర్  కాలేకపోతున్నామని తీవ్రమైన మానసిక క్షోభతో తమ కాంట్రాక్టు ఉద్యోగులు పిట్టల్లా రాలిపోతున్నారని ఆయనన్నారు. తాము చనిపోతే తమపై ఆధారపడిన కుటుంబం మొత్తం దిక్కూమొక్కు లేకుండా అనాధలుగా రోడ్డున పడుతోందని, జీఓ 25 అమలుకు నోచుకోకపోవడంతో కనీసం పైసా కూడా ఇన్స్యూరెన్స్ కూడా అందని దుర్భర పరిస్థితి తమదన్నారు. రెగ్యులర్ లేదు... ఛస్తే దిక్కూ లేదు.... ఇదీ రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య శాఖ లోని అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగుల దౌర్భాగ్యపరిస్థితి అని కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం నేత జి.వి.వి.ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకొచ్చి అన్ని అర్హతలు ఉన్నా వైద్య ఆరోగ్య శాఖ లోని కాంట్రాక్టు ఉద్యోగులను తక్షణమే రెగ్యులర్ చేయాలని, ఇదే నినాదంతో కాంట్రాక్టు ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తున్నారని, తమ రెగ్యులర్ సమస్య తేలేవరకూ ఉద్యమం కొనసాగుతుందని ఆయన వెల్లడించారు.