Thursday 24th June 2021

సచివాలయ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కు ముఖ్యమంత్రి జగన్ భరోసా
 

- అక్టోబరు నాటికి చేసేలా అధికారులకు  ఆదేశాలు
- సీఎంను కలిసిన యూనియన్ నాయకులు

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఉద్యోగంలో చేరి రెండేళ్లవుతున్న సందర్భంగా వారిని రెగ్యులర్ చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ బుధవారం భరోసా ఇచ్చారు. తక్షణమే వీరి రెగ్యులరైజేషన్  కు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.  ఈ విషయాన్ని  గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ భీమిరెడ్డి అంజనరెడ్డి , ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమ్మరావు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ను బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వీరు కలిశారు. ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి వీరితో పాటు ఉన్నారు. సచివాయల ఉద్యోగుల సమస్యలపై తాము సీఎంతో 20 నిముషాల పాటు చర్చించినట్లు తెలిపారు.


రైతు భరోసా కేంద్రాల్లో ఉన్న ఉద్యోగుల సమస్యలను ప్రధానంగా చర్చించినట్లు తెలిపారు. ఈ కేంద్రాలకు అదనంగా మరో ఇద్దరు ఉద్యోగులను నియమించాలని కోరగా ముఖ్యమంత్రి అధికారులకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారని అన్నారు. అక్కడే ఉన్న ఆర్థికశాఖ అధికారులతో మాట్లాడారని వారు చెప్పారు.