Thursday 24th June 2021

కాంట్రాక్టు ఉద్యోగుల ఖాళీలు వదిలేసి మిగిలిన పోస్టులే భర్తీ చేయండి

- ముఖ్యమంత్రిని కలిసి వెంకట్రామిరెడ్డి వినతి

- 2008 డీఎస్సీ నియామాకలపైనా అభ్యర్థన

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్) జూన్ 9-  ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలలో ఇప్పటికే కొందరు కాంట్రాక్టు ఉద్యోగులు, పొరుగు సేవల ఉద్యోగులు పని చేస్తున్నారని వారి ఆ ఖాళీలు వారికే వదిలివేయాలని ముఖ్యమంత్రి జగన్ కు గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్ కె.వెంకట్రామిరెడ్డి విన్నవించారు. ఆ పోస్టులు అలాగే వదిలేసి మిగిలిన ఖాళీలు  భర్తీ చేయాలని కోరినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ ను బుధవారం వెంకట్రామిరెడ్డి, మరికొన్ని సంఘాల నేతలు కలిశారు. 2008  డీఎస్సీలో కామన్ మెరిట్ పాటించకపోవడం వల్ల నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేయాలని కూడా కోరినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి  సానుకూలంగా స్పందించి వారందరినీ  కాంట్రాక్టు పద్ధతిలో  టీచర్లుగా నియమిస్తామని చెప్పారన్నారు.  దీని వల్ల 2,193 మంది అభ్యర్థులకు న్యాయం జరుగుతుందన్నారు.   గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను నియమించి  ఈ అక్టోబర్ 2 వ తారీఖు నాటికి రెండు సంవత్సరాలు పూర్తి అవుతున్నందున ప్రొబెషన్ డిక్లేర్ చేయాలని సీఎంను కోరినట్లు చెప్పారు.  రెండు సంవత్సరాలు నిండగానే సంబంధిత శాఖాపరమైన పరీక్షల్లో పాసైన వారందరినీ ప్రొబెషనరీ  డిక్లేర్ చేస్తామని ముఖ్యమంత్రి హామీ  ఇచ్చినట్లు తెలిపారు.  అలాగే ఇందుకు సంబంధించిన ప్రక్రియను మొదలు పెట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారన్నారు.