Thursday 24th June 2021

తార్నాక ఆస్పత్రిని కోవిడ్ ఆస్పత్రిగా తక్షణం మార్చాలి
 

- ఆలస్యం తగదు...పెద్దగా నిధులూ ఖర్చు కావు
- ఆర్టీసీ  ఎంప్లాయిస్ యూనియన్ డిమాండ్

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
జూన్ 9-  తార్నాక ఆర్టీసి ఆస్పత్రిలో కోవిడ్ కేంద్రం పనులు తక్షణమే పూర్తి చేయాలని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్. బాబు, కె. రాజిరెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటికే కరోనా తొలి రెండు దశల్లో అనేక మంది ఆర్టీసీ కార్మికులను కోల్పోయామని బుధవారం వారొక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఆస్పత్రిని కోవిడ్ ఆస్పత్రిగా మార్చేందుకు రూ.100 కోట్లు ఖర్చవుతుందన్నట్లుగా భూతద్దంలో చూపుతున్నారని వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.  ఐసీయూ వార్డులో 8 బెడ్లు, 4 వెంటిలేటర్లు తదితర పరికరాలకు సుమారు 2 కోట్ల లోపే ఖర్చవుతుందని భావిస్తున్నామని తెలిపారు. తక్షణమే ఆ నిధులు కేటాయించి ఐసీయూ వార్డులో పడకలు, వెంటిలేటర్లు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.  తక్షణమే సిబ్బందిని నియమించి యుద్ధప్రాతిపదికన మొదటి ప్రాధాన్యం ఇస్తూ కోవిడ్ కేంద్ర పనులను పూర్తి చేయాలని ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్.బాబు, కె. రాజిరెడ్డి డిమాండ్ చేశారు. కోవిడ్ పేషెంట్లను అవసరమైతే రిఫరల్ ఆస్పత్రికి పంపాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయివేటు ఆస్పత్రుల్లో అప్పు చేసి చికిత్స పొందిన వారికి ఆ నిధులు రీయింబర్సు చేయాలని డిమాండ్ చేశారు.   కరోనా వ్యాధి సోకి చనిపోయినవారికి  రూ. 50 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించాలని, ఆర్టీసి కార్మికుల కుటుంబ సభ్యులకు కూడా వెంటనే కరోనా వ్యాక్సిన్ ఇచ్చే ఏర్పాటు ఎస్. బాబు, కె. రాజిరెడ్డి డిమాండ్ చేశారు.