కరోనా సోకినా ఉద్యోగికి  అసాధారణ సెలవు ఇవ్వొచ్చు !

-  ఆ విభాగాధిపతి ఇష్ట ప్రకారం మంజూరు చేయొచ్చు
-  కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు
- కేంద్ర ఉద్యోగులకు కరోనా సెలవులపై ఉత్తర్వులు
 (ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
కోవిడ్ కష్ట కాలంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల ఉద్యోగుల బాధలు వర్ణనాతీతం.  సెలవుల విషయంలోనూ వారు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ సిబ్బంది వ్యవహారాలశాఖ  ఈ విషయంలో పూర్తి స్పష్టత ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీని వల్ల రాష్ర్ట ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకునేందుకు మార్గం సుగమం అవుతుందని రాష్ర్ట ప్రభుత్వ అధికారులు పేర్కొంటున్నారు. కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ  కార్యదర్శి సునీల్ కుమార్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. ఉద్యోగులకు ఇందులో అనేక వెసులుబాట్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
- కరోనా సోకిన ఉద్యోగికి ఎలాంటి సెలవూ లేకపోతే ఎక్స్ ట్రార్డినరీ సెలవూ (అసాధారణ సెలవు) ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇంకా చెప్పాలంటే కోవిడ్ సోకి, ఆస్పత్రి పాలై, డిశ్చార్జి అయిన తర్వాత ఇబ్బందులు పడుతూ సెలవు పెట్టవలసి వస్తే ఆ సందర్భంలో ఆ ఉద్యోగికి సెలవులు లేకపోయినా సంబందిత అథారిటీ ( ఆ విభాగాధిపతి) తన స్వీయ నిర్ణయాధికారంతో సెలవు మంజూరు చేయవచ్చని కూడా వెసులు బాటు కల్పించింది.
కేంద్ర ఉద్యోగులకు కరోనా సెలవుల విధి విధానాలు ఇలా ఉన్నాయి...
- ఉద్యోగికి స్వయంగా కరోనా సోకితే 20 రోజుల వరకు కమ్యుటెడ్ లీవు  ఇస్తారు. ఇందుకు ఎలాంటి డాక్టర్ సర్టిఫికెట్ సమర్పించవలసిన అవసరం లేదు. కోవిడ్ పాజిటివ్ అన్న రిపోర్టు  ఆధారంగా ఇది ఇస్తారు. కమ్యుటెడ్ లీవు లేకపోతే 15 రోజుల ప్రత్యేక సాధారణ సెలవు మంజూరు చేస్తారు. దీనికి తోడుగా సంపాదిత సెలవు, హాఫ్ డే పే లీవు ఇస్తారు. ఒక వేళ ఈ సెలవులు ఏమీ లేకపోతే అసాధారణ సెలవు మంజూరు చేయవచ్చు.( ఎక్స్ ట్రార్డినరీ లీవు). ఇందుకు ఎలాంటి వైద్య ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ కాలాన్ని సర్వీసులో ఉన్నట్లుగానే పరిగణిస్తారు.
20 రోజుల తర్వాత డ్యూటీకి హాజరు కాలేకపోతే....
- ఒక వేళ ఆస్పత్రిలో చేరి 20 రోజుల తర్వాత కూడా విధులకు హాజరు కాలేని పక్షంలో  ఆస్పత్రిలో చేరారన్న డాక్యుమెంట్ ఆధారంగా కమ్యుటెడ్ లీవు మంజూరు చేస్తారు.
- కోవిడ్ తో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి కోవిడ్ అనంతర సమస్యలతో మరిన్ని రోజులు సెలవు అవసరమైనా మంజూరు చేస్తారు. ఒక వేళ కమ్యుటెడ్ లీవు అతనికి లేకపోతే ప్రత్యేక సాధారణ సెలవు, ఈ ఎల్, లేదా అసాధారణ  సెలవు మంజూరు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఉద్యోగి కుటుంబ సభ్యులకు కోవిడ్ సోకితే...
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కుటుంబ సభ్యులు లేదా వారి తల్లిదండ్రలుకు కోవిడ్  సోకినా దాదాపు ఇవే నిబంధనలు వర్తిస్తాయి. ఈ సందర్భంలోను 15 రోజుల ప్రత్యేక సాధారణ సెలవు వర్తిస్తుంది. మెడికల్ సర్టిఫికెట్ అక్కర్లేదు. ఒక వేళ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులూ ఆస్పత్రి పాలైతే ఆ 15 రోజుల సెలవు పూర్తయిన తర్వాత ఇంకా అవసరం ఏర్పడితే ఆ ఉద్యోగికి ఉన్న ఏ సెలవు అయినా వినియోగించుకోవచ్చు. ఏ సెలవు వినియోగించుకోలేని పరిస్థితి ఉన్న వారికి ఆ ఉద్యోగి పని చేసే విభాగాధిపతి తగిన నిర్ణయం తీసుకుని సెలవు మంజూరు చేసే అధికారం కల్పించారు. ఆయన నిర్ణయమే ఫైనల్ గా పేర్కొన్నారు.
- ఒక వేళ కోవిడ్ సోకిన వారిని ఉద్యోగి కలిస్తే ముందు జాగ్రత్తగా క్వారంటైన్ లో ఉంటే ఏడు రోజుల పాటు సెలవు లేదా ఇంటి నుంచి పనికి అనుమతిస్తారు. వారు నివసించే ప్రాంతంలో  కంటైన్ మెంట్ జోన్ గా ఉండి విధులకు రాలేకపోయినా వారం రోజుల పాటు సెలవు లేదా వర్కు ఫ్రం హోం వినియోగించుకోవచ్చు.
2020  మార్చి 25 నుంచి ఈ  ఉత్తర్వులు అమలులోకి రానున్నాయి.

ఎక్కువ మందిచదివినవి