Thursday 24th June 2021

సీపీఎస్ రద్దు కు ఏడు రోజులన్నారు 765 రోజులయ్యింది ...!
 

- తక్షణమే రద్దు కు చర్యలు తీసుకోవాలి
-  సీఎం జగన్ కు ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ


(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
జూన్ 11- అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని జగన్ హామీ ఇచ్చారని, ఆ గడువు మీరి 765 రోజులైనా ఇప్పటికీ నెరవేర్చలేదని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. ఆ హామీని నెరవేర్చాలని విన్నవిస్తూ ముఖ్యమత్రి జగన్ కు శుక్రవారం ఆయన లేఖ రాశారు. జగన్ హామీ ఇస్తే వెనకడుగు వేయరని ఈ రాష్ర్టంలోని అందరూ నమ్ముతుంటారని, ఉద్యోగులకు ఇచ్చిన సీపీఎస్ రద్దు హామీని కూడా నెరవేర్చాలని ఆయన విన్నవించారు. పాదయాత్ర సమయంలోను, ఎన్నికల మేనిఫెస్టోలోను  ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం రద్దు చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన పేర్కొన్నారు. తిరిగి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారని రఘురామకృష్ణంరాజు గుర్తు చేశారు. పాత పెన్షన్ విధానంలో  ఉద్యోగి ఎలాంటి వాటా చెల్లించకుండానే మూలవేతనంలో 50శాతం పదవీ విరమణ తర్వాత పెన్షన్ గా పొందే  అవకాశం ఉందని, 2004 తర్వాత ఉద్యోగంలో చేరిన దాదాపు 4 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు సీపీఎస్ పరిధిలోకి వచ్చారని, వారు పాత పెన్షన్ విధానాన్ని కోరుకుంటన్నారని రఘురామకృష్ణంరాజు వివరించారు.