Thursday 24th June 2021

3,4,5 తరగతుల విభజన వద్దు!
 

- ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య వినతి పత్రాలు
- అన్ని చోట్ల ప్రజాప్రతినిధులకు సమర్పణకు చర్యలు

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
జూన్ 11-  ఫౌండేషన్ స్కూళ్ల ఏర్పాటు పేరుతో ప్రాథమిక విద్యను బలహీనపరచడం తగదని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య పేర్కొంది.  విద్యను 5+3+3+4 విధంగా మార్చడానికి, ఫౌండేషన్ స్కూళ్ల ఏర్పాటుకు చాలా వ్యత్యాసం ఉందని పేర్కొంది. కొత్త విధానంలో కొన్నింటని ఫ్యాప్టో ఆహ్వానిస్తున్నా కొన్నింటిని వ్యతిరేకిస్తోందని విద్యాశాఖ డైరక్టర్ కు ఫ్యాప్టో నాయకులు జి.వి.నారాయణరెడ్డి, కె.నరహరి శుక్రవారం లేఖ రాశారు.  ఇవే ప్రతుల ఆధారంగా అన్ని చోట్ల  జిల్లాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు,మంత్రులు తదితరులకు వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. ఈ ఉద్యమ కార్యాచరణను ఫ్యాప్టో ప్రకటించింది. డైరక్టర్ కు ఫ్యాప్టో తరపున లేఖ పంపింది. అదనంగా పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టడం, +2 తరగతులను ప్రారంభించడాన్ని ఫ్యాప్టో  స్వాగతిస్తోందని చెప్పారు. ప్రాధమిక పాఠశాలల నుండి 3,4,5 తరగతులు 3 కిలోమీటర్ల దూరం పైబడి ఉన్న ఉన్నత పాఠశాలలకు తరలించే చర్యలను వ్యతిరేకిస్తున్నామన్నారు.  ఇది విద్యాహక్కు చట్టం 2009 కి వ్యతిరేకంగా ఉందని పేర్కొన్నారు.  ప్రతి కిలోమీటరు పరిధిలో ఒక ప్రాథమిక పాఠశాల ఉండాలి అనే నిబంధనకు విరుద్ధంగా ఉందన్నారు.  ఈ చర్య వల్ల ఎనిమిది సంవత్సరాల వయసున్న పిల్లలు 3 కిలోమీటర్ల పైబడి దూరంలో ఉన్న ఉన్నత పాఠశాలలకు వెళ్ళి చదువుకోవడం  కష్టమవుతుందని వివరించారు. ఫ్యాప్టో డిమాండ్లు ఇలా ఉన్నాయి...
-  ప్రాథమిక పాఠశాలలకు ప్రీ ప్రైమరీ తరగతులు అనుసంధానం చేయాలి. శిక్షణ పొందిన ఉపాధ్యాయులను ప్రీ ప్రైమరీ తరగతుల బోధనకు నియమించాలి. వారికి ఏవిధమైన ఇతర బాధ్యతలు ఉండకూడదు. రెగ్యులర్ ఉపాధ్యాయులకు ప్రాధమిక తరగతుల బోధన మాత్రమే ఉండాలి.
- ప్రాథమిక పాఠశాలల నుండి 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలలకు తరలించకూడదు. ఒకే కాంపౌండ్ లో ఉన్న ప్రాధమిక పాఠశాలలను సైతం ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయకూడదు.
- అన్ని ప్రాథమిక పాఠశాలలను కొనసాగించాలి. వాటి స్థాయిని తగ్గించకూడదు.
- ప్రతీ ప్రాథమిక పాఠశాశాలకు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడి పోస్టు మంజూరు చేయాలి.
- 2020 లో పేర్కొన్న విధంగా ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు అన్నింటిలోనూ బోధన మాతృభాష మాధ్యమంలోనే  ఉండాలి.
-  ఉన్నత పాఠశాలల్లో ప్రస్తుతం ఉన్న విధంగా సమాంతర మాధ్యమాలను కొనసాగించాలి. 
- ప్రతీ మండల కేంద్రంలో తప్పనిసరిగా  400 కంటే ఎక్కువ రోలు ఉన్న ఉన్నత పాఠశాలల్లో  + 2 తరగతులు ప్రారంభించాలి.
- నాణ్యతా ప్రమాణాల కోసం  26 వేల పైబడి ఉన్న ఉపాధ్యాయ ఖాళీలను డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలి.