ఉద్యోగులకు 7 డీఏలు చెల్లించండి పీఆర్సీ అమలు చేయండి

 

- ముఖ్యమంత్రి జగన్ కు ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)

జూన్ 15- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగులో ఉన్న 7 డీఏలను తక్షణమే చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వడంతో పాటు కొత్త వేతన సవరణను అమలు చేస్తూ నిర్ణయం తీసుకోవాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ కు మంగళవారం ఆయన లేఖ రాశారు. ఆయన వరుసగా రాస్తున్న లేఖల క్రమంలో భాగంగా మంగళవారం ప్రభుత్వ ఉద్యోగుల అంశాలపై డిమాండ్లు సంధించారు. 

2018 జులై ఒకటి నుంచి ఇవ్వాల్సిన డీఏ కు సంబంధించి కిందటి ఏడాది నవంబరు నెలలో ఉత్తర్వులు ఇచ్చారని-జనవరి నెల జీతంతో పాటు నగదుగా ఇస్తామని పేర్కొన్నారని రఘురామకృష్ణంరాజు వివరించారు. బకాయిలు జీపీఎఫ్ ఖాతాలకు మూడు సమాన వాటాలుగా జమ చేస్తామని చెప్పారని, ఇప్పటి వరకు ఇవేమీ జరగలేదని ఆయన పేర్కొన్నారు. పదవీ విరమణ చేసే ఉద్యోగులకు నాలుగు నెలల ముందే జీపీఎఫ్ చెల్లింపులు నిలిపివేస్తారని, వారికి నగదు రూపంలోనే చెల్లించాల్సి ఉంటుందని, ఆ మొత్తాలు ఎవరికీ చెల్లించలేదని ఎంపీ వివరించారు. 2020 జనవరి 1, 2020 జులై 1, 2021 జనవరి 1 నుంచి అమలు చేయాల్సిన డీఏ లు ప్రభుత్వం ప్రకటించాల్సి ఉందని, అందుకోసం ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. కరోనా రెండో దశ కారణంగా చూపి ఆ డీఏలు ఆపివేస్తారేమో నని వారు ఆందోళన చెందుతున్నారని ఎంపీ తన లేఖలో ప్రస్తావించారు. 2020 జనవరి ఒకటి నుంచి 2021 జూన్ 30 వరకు డీఏ బకాయిలు చెల్లించబోమని మీరు ప్రకటించడమూ ఉద్యోగులకు నష్టం వాటిల్లిందని వివరించారు.

పీఆర్సీ అమలును పరిశీలించి సరైన మార్గనిర్దేశనం చేసేందుకు మరో సబ్ కమిటీని నియమిస్తూ 2021 ఏప్రిల్ 1న మరో ఉత్తర్వులు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. తక్షణమే ఇందుకు సంబంధించిన నివేదికలను రప్పించుకుని పీఆర్సీ అమలు చేయాలని, ఉద్యోగుల మోములో ఆనందం చూసేందుకు ఈ నిర్ణయాలు తీసుకోవాలని ఎంపీ రఘురామ సీఎం జగన్ కు విన్నవించారు. తమ గెలుపులో కీలక స్థంబాలుగా నిలిచిన ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సి ఉందన్నారు.