ఉద్యోగ నేతలంతా ఒకే వేదిక పైకి...!
 

వైద్య ఆరోగ్యశాఖ జేఏసీ సమావేశంలో ఐక్యంగా...


(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
జూన్ 28-  ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రధాన ఉద్యోగ సంఘాల అధ్యక్షులుగా వివిధ జేఏసీల ఛైర్మన్లుగా ఉన్న నేతలంతా సోమవారం ఒకే వేదికపై దర్శనమిచ్చారు.  వివిధ సంఘాలుగా విడిపోయి ఎవరి ఆలోచనల మేరకు, ఎవరి సిద్ధాంతాల మేరకు వారుగా ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేసే వీరు సోమవారం ఒకే వేదికను పంచుకున్నారు. రాష్ర్ట ఎన్ జీ వో అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె.ఆర్.సూర్యనారాయణరెడ్డి, ఏపీ గవర్నమెంటు ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి ఒకే సమావేశంలో పాల్గొన్నారు. జీవో 64 ఉపసంహరించుకోవాలంటూ వైద్య ఉద్యోగుల జేఏసీ నిర్వహించిన సమావేశంలో వీరు కలిసి పాల్గొన్నారు. రాష్ర్టంలో ఉద్యోగులందరిలోను ఈ పరిణామం చర్చనీయాంశమయింది. వీరంతా కలిసి ఒక ఐక్య వేదికగా రూపొంది పీఆర్సీ, డీఏలు తదితర అనేక సమస్యల పరిష్కారానికి అడుగులు వేస్తే వాటిని సాధించుకునే ఆస్కారం ఉందనే చర్చ ఇప్పటికే ఉద్యోగుల్లో ఉంది. ఉద్యోగులకు సంబంధించిన ఒకే సమస్యలపై వివిధ సంఘాలుగా కలిసి ప్రయత్నించేందుకు అడుగులు పడాల్సిన తరుణం ఆసన్నమయిందన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.