Thursday 24th June 2021

సచివాలయ ఉద్యోగులకు కోవిడ్ డ్యూటీలా?
 

- బీమా లేక భయపడుతున్నారు

- ఇప్పటికే 60 మంది మృతి

-ప్రవీణ్ ప్రకాష్ ను కలిసిన సంఘం నేతలు

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)

జూన్ 3-   గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులకు బీమా వర్తించకపోవడం వల్ల కోవిడ్  డ్యూటీ చేయడానికి భయపడుతున్నారని  ఆ ఎంప్లాయిస్ అసోసియేషన్ (రిజిష్టర్ నెం 13-2020) ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ కు, టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డికి తెలియజేసింది. వార్డు, గ్రామ సచివాలయాల్లోనే కాకుండా కోవిడ్ ఆస్పత్రుల్లోను వీరికి డ్యూటీలు వేస్తున్నారని అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. ఇంతవరకు 6,000 మంది  సచివాలయ ఉద్యోగులకు కరోనా సోకితే 60 మంది చనిపోయారని వారు వివరించారు. ఆ కుటుంబాలను ఏ రకంగాను ఆదుకోలేదని తెలిపారు. సంఘం రాష్ట్ర జనరల్ సెక్రెటరీ బత్తుల అంకమ్మ రావు,రాష్ట్ర ఉపాధ్యక్షులు విప్పర్తి నిఖిల్ కృష్ణ, డాక్టర్ బి.ఆర్.ఆర్.కిషోర్తోట మహేష్ లు తాడేపల్లి లోని ముఖ్యమంత్రి  నివాసంలో  ప్రవీణ్ ప్రకాష్ ను , వై వి సుబ్బారెడ్డిని కలిశారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కాకర్ల వెంకట్రామిరెడ్డి కూడా వీరితో ఉన్నారు.   వీరి డిమాండ్లు ఇలా ఉన్నాయి.

- ఉద్యోగంలో చేరినప్పటి నుంచి అనారోగ్యంతో, కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు సాయం చేయాలి. కోవిడ్ తో ఆస్పత్రిలో చేరి వైద్యం చేయించుకున్నందుకు అయిన ఖర్చులు తిరిగి చెల్లించాలి.

- కోవిడ్ సోకిన సచివాలయ ఉద్యోగులకు నెల రోజుల జీతంతో కూడిన సెలవు ఇవ్వాలి.

- కోవిడ్ సోకిన సచివాలయ సిబ్బందికి ప్రత్యేకంగా ప్రయివేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం చేయించాలి.

- ప్రంట్ లైన్ వర్కర్లకు అమలు చేస్తున్న రూ. 50 లక్షల బీమా వర్తింపజేయాలి.  ఎవరైనా మరణిస్తే కారుణ్య నియామకం కింద ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి.

- కోవిడ్ 19 ఐసీయూ, ఆస్పత్రుల డ్యూటీలు రద్దు చేయాలి

- రోజు విడిచి రోజు విధులకు హాజరయ్యే అవకాశం ఇవ్వాలి.

-  నెలకు 250 సర్వీసులు కచ్చితంగా చేయాలన్న నిబంధన వాయిదా వేయాలి. కరోనాతో ప్రజలు సచివాలయానికి రావడానికీ భయపడుతున్నారు.