ఉద్యోగులకు ఇక ఫిట్ మెంట్ టెన్షన్

-పీఆర్ సీ సిఫార్సు మరీ తక్కువగా ఉందా?

-ఏపీ ఐఆర్ కన్నా తక్కువ సిఫార్సా

(ఉద్యోగులు న్యూస్)

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులకు జనవరి మూడో వారంలో వేతన సవరణ ప్రకటిస్తామని పేర్కొనడంతో ఉద్యోగుల్లో చర్చోపచర్చలు మొదలయ్యాయి.  బిశ్వాల్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిషన్  పీఆర్సీ  నివేదిక రూపొందించింది. ఆయనతో పాటు కమిటీ సభ్యుడు మహమ్మద్ రఫత్ అలీలు  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను కలిసి నివేదిక అందించారు. తెలంగాణ  రాష్ర్టం ఏర్పడిన తర్వాత ఇది తొలి నివేదిక కావడంతో ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ  నెల 6, 7, 8  తేదీల్లో ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చర్చలు జరపనున్నారు. అనంతరం  పీఆర్సీ అమలుపై మూడో వారంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.ప్రస్తుతం కొత్త పీ ఆర్ సీ లో ఫిట్ మెంట్  ఎంతుంటుందనే అంశమే చర్చనీయాంశమయింది.

పీఆర్సీ  సిఫార్సు ఫిట్ మెంట్  15శాతం మాత్రమే ఉందని  వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇది నిరాశాజనకంగా ఉందని ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఉమ్మడి రాష్ర్టంలో పీఆర్సీ కమిషన్ సిఫార్సు చేసిన మొత్తం కన్నా నాడు తెలంగాణ ప్రభుత్వం ఎ క్కువ మొత్తం ఫిట్ మెంట్ గా నిర్ణయించింది. నాడు 43శాతం ఫిట్ మెంట్ గా ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు ఉద్యోగులు 61శాతం ఫిట్ మెంట్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. కనీసం 43శాతం ఉండబోదా అని ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో రాష్ర్ట ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా  ఉండటంతో పీఆర్ సీ అమలు పై ఆ ప్రభావం పడుతుందా అన్న చర్చ సాగుతోంది. వేతన సవరణ కమిషన్ పీఆర్సీ నివేదిక ఇచ్చిందన్న  సంతోషం, ప్రభుత్వం మూడో వారంలో అమలు ప్రకటన చేయబోతోందన్న సంతోషం మధ్య ఇప్పుడు ఫిట్ మెంట్ టె న్షన్ ఉద్యోగుల్లో ఉంది.  ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ఐఆర్ 27 శాతం వరకు ఇస్తున్నారు. తెలంగాణలో ఐఆర్ కూడా ప్రకటించలేదు.  కనీసం 30శాతానికి మించి ఫిట్ మెంట్ లేకపోతే పీఆర్సీ  అమలు ఆనందం లేకుండా పోతుందని ఉద్యోగులు చెబుతున్నారు.

ఎక్కువ మందిచదివినవి