Thursday 24th June 2021

వేతన సవరణ  ఇప్పట్లో లేనట్టేనా?
 

-  ఆర్థిక పరిస్థితి బట్టి చూద్దామన్న మంత్రి బుగ్గన

నిరాశలో ఉద్యోగులు, పెన్షనర్లు...

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు వేతన సవరణ అమలు ఇప్పట్లో లేనట్టేనా అన్న  అనుమానాలు కలుగుతున్నాయి. కిందటి ఏడాది ముఖ్యమంత్రి జగన్ ను ఎన్ జీ వో సంఘం నేతలు కలిసిన సందర్భంలో ఏప్రిల్ నాటికి ఉద్యోగుల డిమాండ్లు అన్నీ నెరవేరుస్తామని హామీ  ఇచ్చారు. ఆ విషయాన్ని ఎన్ జీ వో సంఘం రాష్ర్ట అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తావించారు. మళ్లీ ఇటీవల ప్రభుత్వానికి రాసిన లేఖలోను నాటి హామీని ఎన్ జీ వో సంఘం గుర్తు చేసింది. దాదాపు మే నెల వెళ్లిపోయింది. వేతన సవరణ అమలు విషయం ఇప్పటికీ కొలిక్కి రాలేదు. రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగుల సంఘమూ వేతన సవరణపై ఎప్పటి నుంచో డిమాండ్లు చేస్తూ వస్తోంది. ప్రభుత్వంతో జరిగే సమావేశాల్లోను సూర్యనారాయణ ఈ డిమాండ్ వినిపిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ నేత వెంకట్రామిరెడ్డి ఈ విషయంలో కొంత సమన్వయం సాధించే ప్రయత్నాలు చేశారు. అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు తదితరులూ పీఆర్సీ డిమాండ్ వినిపిస్తూనే ఉన్నారు. మరో వైపు  ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య కూడా పీఆర్సీ అమలుకు గతంలో కార్యాచరణ ప్రకటించి కొన్ని కార్యక్రమాలూ చేసింది. పీడీఎఫ్ ఎమ్మెల్సీలు తరచు మండలి సమావేశంలో ఈ డిమాండు వినిపిస్తూనే ఉన్నారు.  ఏపీటీఎఫ్, పీఆర్టీయూ వంటి సంఘాలు వేతన సవరణ కోరుతూన ఉన్నాయి.

 2021-22 బడ్జెట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టినా ఉద్యోగులకు మేలు చేసే అంశాలపై ఎలాంటి ప్రకటన లేదు. సంక్షేమ కార్యక్రమాల రూపంలో రూ.వేల కోట్లు పేదల ఖాతాలకు ట్రాన్స్ ఫర్ చేసే పథకాలు ఎన్నో ప్రస్తావించినా పీఆర్సీపై అసలు ఊసే లేదు. 2020 డిసెంబర్ నాటి లెక్కల ప్రకారమే ప్రస్తుత బడ్జెట్ కు వేతనాలు తదితరాలు అంచనా వేసి లెక్కలు కట్టారు. ప్రస్తుత సంవత్సరం అమలు చేయాల్సిన డీఏ భారం కూడా బడ్జెట్ ప్రతిపాదనల్లో ఇంకా చేర్చిన దాఖలా లేదు.

మరో వైపు వేతన సవరణ కమిషన్ సమర్పించిన నివేదికపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీ నియమించారు.ఆ కమిటీ నివేదిక ఇవ్వడానికి కూడా ఇంకా సమయం పట్టేలా ఉంది. ప్రస్తుత కరోనా పరిస్థితులు, ఎన్నికల వివాదాలు, న్యాయస్థానంలో అనేక కేసులు, ఇతరత్రా ఇబ్బందులతో అధికారులంతా ఆ పనుల్లోనే తలమునకలై ఉన్నారు.

చూద్దామన్న మంత్రి బుగ్గన

బడ్జెట్ సమర్పించిన సందర్భంలో శాసనమండలిలో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు పీఆర్సీ పై ప్రశ్నించారు.రాష్ర్ట  ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే  వేతన సవరణ అమలు చేస్తామని చెప్పారు. దీంతో ఈ విషయం ఇప్పట్లో కొలిక్కి వచ్చే అవకాశాలు ఎంత మాత్రం ఉన్నాయనే అనుమానం వ్యక్తమవుతోంది.

ఉద్యోగ నేతలకూ సవాల్..

ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగ సంఘాల నేతలకూ ఈ విషయం పెద్ద సవాల్ గానే  ఉంది. కరోనాతో ప్రజలు అల్లాడిపోతున్న వేళ, ప్రభుత్వం ఆ వ్యవహారాల్లోనే మునిగిపోయి ఉండటంతో పీఆర్సీ డిమాండ్ ను గట్టిగా వినిపించే అవకాశాలు లేకుండా పోతున్నాయని ఉద్యోగ సంఘాల నేతలు అంతర్గత చర్చల్లో పేర్కొంటున్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే పేరిట సంఘాలు పెరుగుతున్నా పోరాట పంథాలో పోటీ వాతావరణం తప్ప ప్రయోజనాలు సాధించుకునే దిశ లేకుండా పోయింది. ఉద్యోగుల సమిష్ఠి ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం తీసుకున్న చిన్న చిన్న సానుకూల నిర్ణయాల్లోనూ తామే సాధించామని ప్రకటించుకునే ఉత్సాహం తప్ప అసలు కార్యాచరణ ,పోరాట తీరు పలచబడిపోతోందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు.