Thursday 24th June 2021

ముఖ్యమంత్రి మేధావులతో చర్చించి
నిర్ణయాలు తీసుకోవాలి

- 3, 4,5 తరగతుల ఉన్నత పాఠశాలల్లో విలీనం తగదు
- ఆప్టా నేతల వెల్లడి, నిరసన కార్యక్రమాలకు పిలుపు

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
జూన్ 10-   జాతీయ నూతన విద్యావిధానంలో కొన్ని మార్పులు చేసి 3,4,5 తరగతులను సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో కలపడం సరికాదని ఆంధ్రప్రదేశ్ ప్రాధమిక ఉపాధ్యాయ సంఘం(ఆప్టా) రాష్ట్ర అధ్యక్ష ,ప్రధాన కార్యదర్సులు ఎ. జి. ఎస్.గణపతి రావు ,కె.ప్రకాశరావు లు ఒక ప్రకటనలో అభిప్రాయపడ్డారు. దీని వల్ల ఆ తరగతుల విద్యార్థులు చదువులు కోల్పోతారని, పెద్ద తరగతుల వారితో కలిసి చదుకునేందుకు వారు ఇష్టపడబోరని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఈ విషయంలో మేధావులు, విద్యా వేత్తలు ,  సామాజిక వేత్తలతో  చర్చించాలని విన్నవించారు.  అఖిలభారత ప్రాధమిక ఉపాధ్యాయ సమాఖ్య  నిర్వహించిన విద్యావంతుల హక్కుల పరిరక్షణ అనే జూమ్ మీటింగ్  లో చర్చించినట్లు   ఆప్టా అధ్యక్షుడు గణపతి రావు తెలియజేశారు. ప్రస్తుతం ఉన్న ప్రాథమిక పాఠశాల వ్యవస్థ (1-5 తరగతుల)కు అదనంగా ప్రేప్రైమరీని కలపడం  మంచిదే అన్నారు. అదే సమయంలో  3,4,5 తరగతులను విడదీయడం తగదన్నారు. ఇప్పుడున్న ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించడానికి తమ సంఘం అనుకూలమని ప్రధాన కార్యదర్శి ప్రకాశరావు పేర్కొన్నారు. సంఘం అభిప్రాయాలను ఆప్టా నాయకులు ఎమ్మెల్యేలు,  ఎమ్మెల్సీలు తదితరులకు మంత్రలకు వినతిపత్రాల రూపంలో తెలియజేయాలని ఆప్టా నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాలను గురువారం నుంచే ప్రారంభించాలని నిర్ణయించామని, ఇతర ఉపాధ్యాయ సంఘాలత సహకారంతోను ప్రత్యక్ష పోరాటం చేయాలని నిర్ణయించినట్లు ఆప్టా నాయకులు తెలిపారు.