Thursday 24th June 2021

హెచ్ ఎం పోస్టులు మంజూరైన వెంటనే 
బదిలీలు, పదోన్నతులు

- విద్యామంత్రి సబితారెడ్డి హామీ

- ఆన్ లైన్ తరగతులపై సంఘాలతో చర్చిస్తాం

-  అంతర్ జిల్లా బదిలీల ఫైలూ నడుస్తోంది

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)

జూన్ 7- తెలంగాణలో ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పోస్టులను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వలు వచ్చిన వెంటనే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపడతామని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంపై సోమవారం జాక్టో, యూయస్సీసీ నాయకులు ఆమెను కలవగా ఈ మేరకు హామీ ఇచ్చారు. విద్యామంత్రి ప్రతిస్పందిస్తూ పలువురు అధికారులు కోవిడ్ బారిన పడటంతో బదిలీల షెడ్యూల్ విడుదలలో జాప్యం జరిగిందన్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన విధంగా ప్రాథమిక పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుల పోస్టుల మంజూరు కోసం  ఫైల్ సర్క్యులేషన్ లో ఉందని, ఆమోదం రాగానే బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేస్తామన్నారు. ఈదఫా పాత పది జిల్లాల ప్రకారం, యాజమాన్యాల వారీగానే బదిలీలు, పదోన్నతులు నిర్వహించనున్నామని స్పష్టంచేశారు. వీటితో పాటే మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు కూడా నిర్వహిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.  అంతర్ జిల్లా బదిలీల ఫైల్ సాధారణ పరిపాలనా శాఖ పరిశీలనకు పంపామని రాగానే ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపి ఆమోదం తీసుకుని షెడ్యూల్ విడుదల చేస్తామన్నారు. జీరో సర్వీసు తో  అంతర్ జిల్లా బదిలీల అంశాన్ని పరిశీలిస్తామని ఉపాధ్యాయ నాయకులకు చెప్పారు. ఉపాధ్యాయులకు  ప్రత్యేక వ్యాక్సినేషన్ పై  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడతామని అన్నారు. విద్యార్థులకు ఆన్లైన్ తరగతుల నిర్వహణపై ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తామని మంత్రి చెప్పారు.